AP CM Jagan : ఈ మధ్యన ఏపీ సీఎం జగన్ కు వయసు పిచ్చి పట్టుకుంది. ఎక్కడకు వెళ్లినా ఆయన వయసు గురించి సంభోదించడం పరిపాటిగా మారింది. మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలిస్తానంటున్న ఆయన తన వయసును కూడా యథాతధంగా ఉండిపోతుందని భ్రమిస్తున్నట్టున్నారు. లేకపోతే చేతిలో పవర్ ఉంటుంది కదా అని వయసు తగ్గించుకునే జీవోలు తెచ్చుకుంటారేమో.. కానీ చంద్రబాబు వయసును ఉద్దేశించి తరచూ ముసలోడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు ముసలోడే.. అందులో నిజం ఉంది. కానీ పదే పదే ముసలోడు అని సంభోదించడం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. ప్రజల్లో ముసలోడు అన్న వాదాన్ని బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నట్టుంది. చివరకు విద్యార్థులకు స్కాలర్ షిప్ ల విడుదల సమయంలో కూడా అదే మాట అనేశారు.
చంద్రబాబు ముసలోడంటూ…
జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు సమకాలికుడు. ఉమ్మడి ఏపీకి 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. నవ్యాంధ్రకు తొలి సీఎంగా ఐదేళ్ల పాటు పాలించారు. ఆయన వయసు 70 సంవత్సరాల మాట దాటుతున్నది నిజం. అయితే ఇప్పుడు అదే పనిగా చంద్రబాబు వయసును గుర్తుచేయడం జగన్ కు రివాజుగా మారింది. ఇన్నాళ్లూ చంద్రబాబు అది చేశాడు.. ఇది చేశాడు అంటూ విమర్శలు గుప్పించిన జగన్ ఇప్పుడు కొత్తగా ముసలోడు అన్న స్లోగన్ మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు పని అయిపోందని అర్ధం వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు. మునపటిలా వయసు సహకరించదని చెప్పుకొస్తున్నారన్న మాట. గతంలో చురుగ్గా పనిచేసేవారని తనంతట తానుగా ఒప్పుకున్నారున్న మాట. అయితే చంద్రబాబుకు సమకాలికుడైన ప్రధాని మోదీకి ఆ మాట అనగలరా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎం మాటలు లేకితనంగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
సిల్లీ రీజన్..
మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. కొంతమంది యువకుల్లో బుద్ధిమాంధ్యం ఉంటుంది. కొంతమంది వృద్ధాప్యానికి వచ్చినా తెగువ, తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. వారి శరీరతత్వం, శారీరక క్రమశిక్షణ, నడవడికతో కొందరు వృద్ధాప్యాన్ని ఇట్టే అధిగమిస్తారు. చంద్రబాబు కూడా ఈ కోవలోకే చెందుతారు. అయితే పదే పదే చంద్రబాబు ముసలోడు అంటే ఆయనకు వచ్చే అనర్ధమంటూ ఏదీ ఉండదు. జగనే పనిగట్టుకొని చంద్రబాబుకు ప్రచారం ఇచ్చినట్టవుతుంది. అదో సిల్లీ రీజన్ అవుతోంది. కానీ జగన్ మాత్రం చంద్రబాబును వేధిస్తున్నట్టు భావిస్తున్నారు. కానీ మానసిక అశాంతితో తన ప్రత్యర్థిని మానసికంగా వేధించాలని అనుకుంటున్నారన్న భావన మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
మరో పదేళ్లు దాటితే..
జగన్ ఎప్పుడూ మధ్య వయస్కుడిగానే ఉంటారా? ఉండగలరా? ప్రస్తుతం ఆయనకు 50 సంవత్సరాలు దాటుతోంది. మరో ఎనిమిది, పదేళ్లు దాటితే ఆయన సీనియర్ సిటిజనే. అంటే వృద్ధుడి కిందే లెక్క. దాన్ని ఆయన ఆపలేరు. తాను వృద్ధుడిని కాదని జీవోలు జారీ చేసుకున్నా… ఆయన వయసు మాత్రం ఆగదు. ఆపలేరు కూడా. వాస్తవానికి జగన్ పనితీరుచేస్తే అస్సలు యువకుడు కనిపంచడు. ఆయన చీకటి పడిన తర్వాత పని చేస్తూ కనిపించిన సందర్బాలే లేవు. నాలుగేళ్లు దాటిపోయినా ఆయన ఫలానా పని కోసం కష్టపడ్డారన్న ప్రశ్నే లేదు. అటువంటిది ఏ వయసులో ఉంటే ఏం లాభం. వయసుతో కాకుండా అభివృద్ధితో పోటీగా నిలిస్తే జనం హర్షిస్తారు. అయితే మానసిక ఆనందానికే జగన్ తొలి ప్రాధాన్యమిస్తారు. అందుకే ఎన్నికల దాకా ఈ ముసలోడు కాన్సెప్ట్ ను లాగేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.