
గతంలో ప్రభుత్వానికి సలహాదారులు అంటే.. ఒక్కరో ఇద్దరో ఉండేవారు. కానీ.. ఏపీ సీఎం జగన్ నియమించిన సలహాదారులను చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. వివిధ రంగాల్లో నియమితులైన వీరంతా.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సూచనలు ఇస్తారన్నమాట. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలని వీరంతా నిరంతరం ఆలోచిస్తూ.. సలహాలు ఇవ్వాల్సి ఉంది. మరి, వీరు ఏ మేరకు సలహాలు ఇస్తున్నారు? వీరి సూచనలను జగన్ ఎంతవరకు తీసుకుంటున్నారు అన్నది తెలియదుగానీ.. ఈ సలహాదారులు మాత్రం సర్కారు ఖజానాకు భారంగా మారారు అన్నది ప్రధాన వాదన. రాష్ట్ర హైకోర్టు కూడా తాజాగా ఇదే విషయమై ప్రశ్నలు వేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు చేసేందుకు ఏకంగా 41 మంది సలహదారులను నియమించడం గమనించాల్సిన అంశం. వీరిలో కొందరు విజయవాడలో, మరికొందరు ఢిల్లీలో, ఇంకొందరు హైదరాబాద్ లో ఉండి సలహాలు అందిస్తున్నారు. ఇందుకుగానూ.. వీరికి వేతనం రూపంలో అందిస్తున్న మొత్తం తక్కువేమీ లేదు. నెలకు అటూఇటుగా 2 లక్షల మేర జీతం అందిస్తున్నట్టు సమాచారం. అదనంగా కారు, ఆఫీసు, ఇతర సిబ్బంది అలవెన్సులు కూడా ఉన్నాయట. ఇంత మందిని ఏర్పాటు చేయడంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు న్యాయస్థానం కూడా ఈ విషయాన్ని తప్పుబట్టింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంది సలహాదారులు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సలహాదారులుగా నియమించామని ప్రభుత్వ లాయరు చెప్పారు. అదేవిధంగా.. వీరి అర్హతలపై ఎలాంటి నిబంధనలూ లేవని చెప్పడం విశేషం. దీనికి కోర్టు స్పందిస్తూ.. గతంలో ఈ పరిస్థితి లేదని, ఇప్పుడే శృతిమించిందని చెప్పింది. అదే సమయంలో సలహాదారుల పనితీరును కూడా ఆక్షేపించింది. సలహదారులకు రాజకీయాలతో పనేంటని, వారు రాజకీయ వ్యాఖ్యానాలు చేయడమేంటని ప్రశ్నించింది. గతంలో వైఎస్ సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు.. వైఎస్ మరణం తర్వాతనే అవసరంకొద్దీ మీడియా ముందుకు వచ్చారని, ఇప్పుడు సలహదారులు అలా లేరని చెప్పడం గమనార్హం.
అదే సమయంలో.. వారికి చెల్లిస్తున్న జీత భత్యాల గురించి కూడా మాట్లాడింది. ఇంత మంది సలహాదారులకు జీతాలు చెల్లించే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడాల్సిన అవసరం లేదా? అని నిలదీసింది. రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. ఇంత మంది అవసరమా? అనే అర్థంలో న్యాయస్థానం ప్రశ్నించింది. మరి, కేబినెట్ ను మించిపోయిన సలహదారుల సంఖ్య విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది చూడాలి.