Margadarsi Case: మార్గదర్శి వ్యవహారంలో జగన్ రామోజీరావును వదలడం లేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ మరింత ముందుకే వెళ్తున్నాడు. ఆ మధ్య రామోజీరావు ను సిఐడి అధికారులు విచారించారు. శైలజను పలు వివరాలు అడిగింది. ఆ తర్వాత రామోజీరావు కోర్టుకు వెళ్లారు. సిఐడి ని తదుపరి అడుగులు వేయకుండా నిరోధించాలని కోర్టును కోరారు. కోర్టు దానికి ఒప్పుకోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎలాగూ ఈ కేసును పట్టించుకోవడం లేదు. రామోజీరావు మీద పగ ఉంది కాబట్టి జగన్ మరింత ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావు మీద నమోదు చేసిన కేసులో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసులు నమోదు చేసిన సిఐడి అధికారులు దాదాపు 820 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
చిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను మార్గదర్శి ఎదుర్కొంటోంది..అవి నిజమని తేలడంతో సిఐడి అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో నమోదు చేశారు. రామోజీరావు ఆస్తులు అటాచ్ చేశారు. గతంలో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో హోదాలో నిర్వహించినప్పుడు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామోజీరావును కూడా విచారించారు. ఫిలిం సిటీ లోని రామోజీరావు నివాసంలో కూడా ఈ విచారణ కొనసాగింది. ఇన్ని పరిణామాల మధ్య ఏపీ సిఐడి అధికారులు రామోజీరావు ఆస్తులను అటాచ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శకులు డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధులు మళ్లించినట్టు ఏపీ సిఐడి అధికారులు నిర్ధారించారు. మార్గదర్శి 40 సంస్థలకు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. 40 సంస్థల పేర్లను ఏపీ సిఐడి అధికారులు జీవోలో పొందుపరిచారు. ఇక ఈ కేసులో తాజాగా ఏపీసీఐడీ అధికారులు మరోసారి రామోజీరావు, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ కు నోటీసులు జారీ చేశారు. వారిని విచారణకు హాజరుకావాలని ఈనెల 16వ తేదీన ఉదయం 10:30కు విజయవాడలోని సత్యనారాయణపురంలో తమ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ మేరకు అదనపు పోలీసు సూపరిండెండెంట్ రాజశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.