Margadarsi Chit Fund Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ మరింత కూపి లాగుతోంది. ఇప్పటికే పలు కీలక వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చిన రాష్ట్ర దర్యాప్తు బృందం.. ఇందులో కీలక విషయాన్ని బయటపెట్టింది. చిట్ ఫండ్స్ ముసుగులో నల్లధనం దందాను సాగించారని అభి యోగాన్ని మోపింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించారని ఏపీ సిఐడి చెబుతోంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసివేసిన 23 చిట్ గ్రూపులతో పాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ చిట్టీల నిర్వహణను తన ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
నోటీసులు ఇచ్చింది
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో రూ. కోటి అంతకుమించి డిపాజిట్లు చేసిన వారికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాన్ని వెలికి తీయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం చిట్ ఫండ్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం అక్రమ డిపాజిట్లు సేకరించిందని ఏపీ సిఐడి అధికారులు, స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో వెలడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి యాజమాన్యం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో రసీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరణ సేకరించామని సిఐడి అధికారులు చెబుతున్నారు. డిపాజిట్ దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సిఐడి అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. మొదటి దశలో కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్ ఫండ్స్ లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలు వెల్లడించాలని నోటీసులో పేర్కొన్నారు.
నిర్ణీత సమయంలోగా..
ఇక సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం డిపాజిట్ దారులు నిర్ణీత కాలంలో సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్ దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సిఐడి అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాస్తవాన్ని నిగ్గు తేలుస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణ నిర్వహించనున్నారు. ఈ ప్రకారం నల్లధనం వివరాలపై ఒక నిర్ధారణకు వచ్చి.. తదుపరిగా విచారణ చేపడతారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి సంస్థకు చెందిన 23 చిట్టి గ్రూపులను మూసివేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయింది. మరిన్ని గ్రూపుల మూసివేత దిశగా అధికారులు చర్యల్లో వేగం పెంచారు. ఈ మేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో ఒక నివేదిక కూడా రూపొందించనున్నారు.
ప్రత్యేక అధికారి నియామకం
మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ఒక అధిక అధికారిని నియమించేందుకు ఏపీ సిఐడి అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టిల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టి పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలు చెల్లించాలి. మూసివేసిన చిట్టి గ్రూపుల చందదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. స్థూలంగా ఏపీ సిఐడి అధికారులు చెప్పేది ఏంటంటే.. మార్గదర్శిలో అనేక అక్రమాలు జరిగాయని, మొన్నటి వరకు తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో ఆ యాజమాన్యం ఇష్టానుసారంగా ప్రవర్తించిందని చెబుతోంది. వాటిని ప్రత్యేక విచారణ ద్వారా గుర్తించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని వివరిస్తోంది. ఏపీ సిఐడి తాజా చర్యల ద్వారా మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న మార్గదర్శి కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరి ఈసారి ఇందులో ఉన్న అక్రమాలను నిగ్గు తేల్చి ఇందులో పాత్రధారులను, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది.