AP Capital Issue: పాడిందే పాట అన్నట్టు.. ఏపీలో రాజధాని విషయంలో అధికార, విపక్షాలు మంకుపట్టు వీడడం లేదు. మూడు రాజధానులు అనేవి ముగిసిన అధ్యయమని విపక్షాలు చెబుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు కట్టి తీరుతామని అధికార పక్షం ప్రకటిస్తోంది. మూడు రాజధానులపై విమర్శలు వచ్చినా.. కోర్టు తప్పుపట్టినా జగన్ సర్కారు మాత్రం ముందుకెళ్లడానికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ సీఎం జగన్ తన ప్రసంగంలో మూడు రాజధానుల కోసం ప్రస్తావించడంతో మరోసారి తెనెతుట్ట కదిపినట్టయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. విశాఖకు పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తూ.. అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అమరావతి రాజధాని రైతులు పోరుబాట పట్టారు. అవిశ్రాంతంగా పోరాడారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అమరావతినే ఏకైక రాజధానిగా చేస్తూ మౌలిక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకూ వెనక్కి తగ్గింది.
సమసిపోయిందన్న తరుణంలో..
అటు కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ అభిష్టమని చెబుతూనే.. కర్నూలకు హైకోర్టు తరలింపునకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. తద్వారా మూడు రాజధానులకు కేంద్రం అనుకూలంగా లేదన్న ప్రచారం అయితే నడుస్తోంది. అయితే కొద్దిరోజులుగా రాజధానుల వివాదం సమసినట్టే కనిపించింది. కానీ తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా జగన్ మాట్లాడడం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి మూడు రాజధానులకు మద్దతుగా అసెంబ్లీలో పెట్టిన బిల్లును వైసీపీ సర్కారు వెనక్కి తీసుకుంది. బిల్లును సమగ్రంగా ప్రవేశపెడతామని సీఎం జగన్ శాసనసభలో స్వయంగా ప్రకటించారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. దీంతో మూడు రాజధానుల విషయం వైసీపీ ప్రభుత్వం మరుగున పెట్టేసిందని అంతా భావించారు. కానీ జగన్ ఇండిపెండెంట్స్ డే నాడు పరోక్ష వ్యాఖ్యలతో మళ్లీ మూడు రాజధానుల విషయం బయటకు వచ్చింది. దుమారానికి కారణమవుతోంది.
Also Read: AP teachers Concern : ఉపాధ్యాయులను వదిలించుకొనే జగన్ కుట్ర..
సీఎం తాజా వ్యాఖ్యలతో..
పాలనా వికేంద్రీకరణ వైసీపీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని సీఎం జగన్ ప్రకటించారు. అందుకే జిల్లాల విభజన విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని స్థాయిలో పాలనా వికేంద్రీకరణకు అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. తద్వారా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదని స్పష్టంచేశారు.ప్రాంతీయ అసమానతలను నియంత్రించాలంటే పాలనా వికేంద్రీకరణే ముఖ్యమని కుండబద్దలు గొట్టారు. మూడు రాజధానులపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని స్పష్టమైన సంకేతాలిచ్చారు.
స్పష్టత వచ్చేనా?
ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ రాజధానుల విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ్యలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. సీఎం జగన్ ఏ క్షణమైన విశాఖకు మకాం మార్చవచ్చని ప్రచారం సాగుతోంది. ఇందుకుగాను విశాఖలో క్యాంప్ ఆఫీసు సైతం సిద్ధమవుతోందన్న టాక్ నడుస్తోంది. త్వరలో అసెంబ్లీలో మూడు రాజధానులకు మద్దతుగా బిల్లు ప్రవేశపెడతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ మూడు రాజధానులకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read:Gold Mines: ఏపీ గనులను పప్పు బెల్లాల్లా విక్రయిస్తున్న కేంద్రం