AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికారం కోసం అందరు అర్రులు చాస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని తాపత్రయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపడుతుందని తెలిసిన సందర్భంలో ఆశావహులు ఊహల పల్లకీలో ఊరేగుతున్నారు. ఈ సారి తమకు స్థానం పక్కా అని ఎవరి అంచనాల్లో వారు ఉండిపోయారు. దీంతో రాబోయే విస్తరణపై ఎవరి లెక్కల్లో వారున్నారు. రెండున్నరేళ్ల కాలంలో మంత్రివర్గ విస్తరణ చేపడతామని చెప్పడంతో సమయం కోసం కాచుకుని కూర్చున్నారు.
కరోనా వైరస్ విస్తరించిన నేపథ్యంలో మంత్రులకు వారి పనలు చేసుకునే సందర్భం రాలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ మరో ఆరు నెలల పాటు వాయిదా వేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులు కూడా తమ బాధ్యతలు నెరవేర్చే సమయం రాకపోవడంతో వారికి ఇచ్చిన పదవులు అలంకారప్రాయాలే అయ్యాయని భావిస్తున్న తరుణంలో మరో ఆరు నెలల సమయం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మంత్రి వర్గాన్ని మూడేళ్ల వరకు ఉంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆశావహుల్లో ఆశలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే ఎక్కువగా ఉన్నాయి. తరువాత చేపట్టబోయే విస్తరణలో కూడా వీరికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. కేబినెట్ లో బలహీన వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మూడేళ్లు వారిని పదవుల్లో ఉంచి తరువాత విస్తరణ చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
రెడ్డి సామాజికవర్గం నేతలైతే భారీగా ఆశలు పెంచుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి నేతలు ఈ సారి పదవులపై ఆశలు పెంచుకున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారోనని ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు మాత్రం ఇప్పుడు తీరేలా లేవు.