AP Cabinet Reshuffle 2022: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఇటీవల అకాల మరణం చెందటంతో ఆయన సీటు ఖాళీగా అయింది. ఇక్కడ నుంచి ఎవరిని పోటీకి దించాలనే దానిపై సీఎం జగన తర్జనభర్జన పడుతున్నారు. మేకపాటి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మేకపాటి కుటుంబానికి జగన్ తో ఉన్న సంబంధం అలాంటిది. అందుకే ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నా వారు దుఖంలో ఉండటంతో ఇప్పుడు మాట్లాడటం అంత మంచిది కాదని వాయిదా వేస్తున్నారు.
మేకపాటి గౌతంరెడ్డి గతంలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతంరెడ్డి దూరం కావడంతో ఇక ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించడం సహజమే. అందుకే దీనిపై సీఎం జగన్ మల్లగుళ్లాలు పడుతున్నారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండటంతో మేకపాటి కుటుంబానికి మంత్రి పదవి ఇస్తారా? అనే సందేహాలు వస్తున్నాయి.
జగన్ నెల్లూరు జిల్లాకు సోమవారం వెళ్లి మేకపాటి గౌతంరెడ్డి సంస్మరణ సభలో పాల్గొననున్నారు. ఇక్కడే మంత్రివర్గ విస్తరణపై మేకపాటి కుటుంబంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మేకపాటి గౌతంరెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆమె నిరాకరిస్తే ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇచ్చేందుకు కూడా ముందుకు రానున్నట్లు చెబుతున్నారు.
రాజమోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఎంపీగా చేయడంతో ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మేకపాటి కుటుంబానికి జగన్ తో ఉన్న అనుబంధానికి ఇదో పరీక్షగా మారనుంది. అయినప్పటికి మేకపాటి కుటుంబానికి ఏదో చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో మరోమారు ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై జగన్ తీసుకునే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉందని తెలుస్తోంది.