వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతోపాటు చివరకు విపక్షాలు కూడా ఎదురు చూస్తున్న సందర్భం కేబినెట్ విస్తరణ. ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటప్పుడే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం మారుతుందని, మిగిలినవారికి అవకాశం ఇస్తానని చెప్పారు జగన్. దీంతో.. ఆ ముహూర్తం కోసం ఆశావహులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ గడియలు దగ్గరపడుతున్నాయి కూడా. దీంతో.. ఆశావహుల్లో ఆశలు రెక్కలు తొడుగుతుండగా.. మంత్రివర్గంలో ఉన్నవారిలో ఆందోళన కొలువుదీరుతోంది. పదవి దక్కించుకునేందుకు వీరు ప్రయత్నిస్తుండగా.. ఎక్కడ తమ పదవి జారిపోతుందేమోనని కేబినెట్లో ఉన్నవారు టెన్షన్ పడుతున్నారు.
గడిచిన రెండు మూడు నెలల నుంచే.. మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతోంది. రేపో మాపో అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. దీంతో.. ఆశావహులు తమ ప్రయత్నాల్లో వేగం పెంచారు. అయితే.. అవసరమైన వారికి మంత్రి పదవులు ఇచ్చి, మిగిలిన వారికి రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతలు ఇస్తామని బుజ్జగిస్తారనే లీకులు వచ్చాయి. అదే సమయంలో.. ప్రజల్లో సదాభిప్రాయం ఉన్నవారిని, వారి పనితీరును లెక్కలోకి తీసుకుంటారని కూడా చెబుతున్నారు.
అయితే.. తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసిన మంత్రులు హ్యాపీగా ఫీలవుతుంటే.. ఆశావహులు మాత్రం నీరుగారిపోతున్నట్టు సమాచారం. వాస్తవానికి రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తానని జగన్ చెప్పినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని మరో ఆర్నెల్లు వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు.
అంటే.. ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తి చేసుకునే వరకు ప్రస్తుత మంత్రివర్గం కొనసాగుతుందని అంటున్నారు. ఆ విధంగా మరో ఆర్నెల్ల పాటు ఇప్పుడున్న మంత్రుల పదవులకు ఢోకా లేదన్నమాట. దీనికి కారణం ఏమంటే.. కరోనా నేపథ్యంలో మంత్రులు తమ బాధ్యతలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని, అందుకే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రేపోమాపో మంత్రి పదవి వస్తుందని ఆశించినవారు డీలా పడిపోతున్నారు.
ఇదిలాఉంటే.. వచ్చే కేబినెట్ ఎలక్షన్ వరకు ఉండబోతుండడంతో.. ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా అవసరమైన వారికి మాత్రమే చోటు కల్పించబోతున్నట్టు సమాచారం. సీనియర్లకు సైతం ఇదే వర్తిస్తుందని జగన్ చెబుతున్నారట. ఆ విధంగా చూస్తే.. కేబినెట్ ప్రక్షాళనలో ఎవరు ఉంటారో? ఎవరో పోతారో చెప్పడం కష్టమేనని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.