AP Cabinet Expansion: ఏపీ సీఎం జగన్ కు ఏప్రిల్ గండం పొంచి ఉంది. గత మూడేళ్లుగా తిరుగులేని ఆధిపత్యంతో వ్యవహరిస్తూ వచ్చిన ఆయనకు రాబోయే పరిణామాలు తలబొప్పి కట్టించనున్నాయి. తిరుగులేని సంఖ్యాబలంతో నేనేమి చేసినా చెల్లుబాటవుతుందని ఆయన పాలన సాగించారు. ఇక అలా చేస్తే కుదిరే పనిగా కనిపించడం లేదు. మంత్రివర్గ విస్తరణ ద్వారా తెనె తుట్టను కదిలించిన ఆయన అసమ్మతి పోటు తప్పేలా లేదు. అత్యంత సన్నిహితులు, అనుచరులుగా ఉన్న కొంతమంది సీనియర్లు తిరుగుబావుట ఎగుర వేసే ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెంట నడిచిన కొంత మంది నాయకులు పార్టీలో మెరుగైన అవకాశాలు దక్కక పక్క చూపులు చూస్తున్నారు. గ్రామస్థాయి కేడర్ సైతం వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు.
ముందుగా తమ శ్రేణులను ఇతర పార్టీలోకి చేర్చే పనిలో ఉన్నారు. పనులన్నీ చక్కదిద్దిన తరువాత వారు ఆ పార్టీలో చేరేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే సీనియర్ మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారు తమను మంత్రివర్గం నుంచి తప్పిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరికలు సైతం పంపారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి, పాలెం శ్రీకాంత్ రెడ్డి వంటి వారు తమకు మంత్రివర్గంలో తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అవకాశం కల్పించకపోతే తమ ప్రతాపం చూపుతామని బాహటంగానే చెబుతున్నారు. తమ సొంత జిల్లాల్లో పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని బలమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, డీఎల్ రవీంద్రరెడ్డి వంటి వారు పార్టీలో అవకాశాలు లేక వేరే పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఎన్నికల ముందు తాయిలాలు ఆశించి పార్టీలో చేరిన వారు పక్క పార్టీలో జాయిన్ అయ్యేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. ఏప్రిల్ జరిగే పరిణామాలతో అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Also Read: KCR Delhi Tour: కేసీఆర్ తరుచూ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు?
రూటు మారుస్తున్న దాడి మాస్టారు
తెలుగుదేశం పార్టీలో దాడి వీరభద్రరావుది ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో కీలక పోర్టుపోలియోలు నిర్వహించారు. జగన్ పిలుపు మేరకు శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా ఉన్నదాడి మాస్టారు వైసీపీ గూటికి చేరారు. అప్పట్లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. కానీ అటు తరువాత జరిగిన పరిణామాలు ఆయనకు చుక్కెదురయ్యాయి. తన కుమారుడు దాడి రత్నాకర్ కు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలన్న ఆయన ప్రయత్నాలను జగన్ ఏ మాత్రం సహకరించలేదు. దీంతో ఆయన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. పోనీ పెద్దల సభ రాజ్యసభకు వెళ్లాలన్న దాడి మాస్టారు కల కూడా నెరవేరలేదు. కనీసం ఎమ్మెల్సీ పదవినైనా ఇవ్వాలని ప్రాధేయపడినా పార్టీ అధినేత వినలేదు. పైగా తనకంటే జూనియర్లు, అనామకులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. అందుకే ఆయన వైసీపీతో పాటు అధినేత జగన్ తీరుపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. లోలోన రగిలిపోతున్నారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజులు చూసి వేరే పార్టీలోకి జంప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు జనసేన సరైన వేదికగా భావిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి దాడి మాస్టారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాస్టారి అనుభవాలను తెలుసుకున్నారు. అప్పట్లోనే ఆయన జనసేనలో చేరుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆయన గుంభనంగా ఉండిపోయారు. ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకుంటే జనసేన శ్రేయస్కరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీలోకి వెళ్లినా ఆయనకు పూర్వవైభవం దక్కే అవకాశమే లేదు. అందుకే జనసేనలో చేరడం ద్వారా భవిష్యత్ లో పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలు కలిసినా క్రియాశీలక పాత్ర వహించే అవకాశముంది.
మాజీ మంత్రి కొత్తపల్లి కీనుక
గోదావరి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా డిఫెన్స్ లో పడ్డారు. అనవసరంగా వైసీపీలో చేరానన్న అసంత్రుప్తి ఆయన్ను వెంటాడుతోంది. ఇటీవలస జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ తన చెప్పుతో తానే కొట్టుకోవడం ద్వారా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నానన్న సంకేతాలు పంపారు. ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం ఆయన టీడీపీ ప్రభుత్వంతో పాటు పార్టీలో పదవులు నిర్వర్తించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పోరేషన్ పదవిని సైతం చేపట్టారు. ఎన్నికల ముందు రాజకీయ సమీకరణల్లో భాగంగా వైసీపీలో చేరారు. కానీ టిక్కెట్ దక్కలేదు. అయినా పార్టీ అభ్యర్థి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. కానీ ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు ఆశించిన స్థాయి గుర్తింపు దక్కలేదు. పార్టీలో పొమ్మన లేక పొగబెడుతూ వచ్చారు. దీంతో ఆయన తన మనసును మార్చుకున్నారు. జనసేనలో చేరితేనే రాజకీయ భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. మరో మాజీ మంత్రి, కడప నేత డీఎల్ రవీంద్రరెడ్డిది విలక్షణ శైలి. సొంత పార్టీలో లోపాలున్నా ఎత్తిచూపే తత్వం ఆయనది. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా కుండబద్దలు కొట్టినట్టు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన సైతం జనసేన వైపే చూస్తున్నారు. క్లీన్ ఇమేజ్ తో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తోనే మార్పు సాధ్యమని భావిస్తున్నారు. త్వరలో ఆయన జనసేన గూటికమ్నట్టు సమాచారం. మరోవైపు మంత్రివర్గంలో పదవులు కోల్పోయిన వారు, మంత్రి పదవులు దక్కని వారు, ఎన్నికల మందు అధికార పార్టీలో చేరి అవకాశాలు దక్కని వారు పక్కచూపులు చూపే అవకాశం ఉంది. అందుకు ఏప్రిల్ నుంచే అడుగులు పడనున్నాయని తెలుస్తుండడంతో సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏప్రిల్ సంక్షోభం ఎలా గట్టెక్కుతారానోనని వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి.
Also Read: Bandi Sanjay: పోలీస్ వ్యవస్థపై సంజయ్ ఒత్తిడి.. పట్టు కోసం ప్రయత్నాలు..