AP BJP: ఏపీ బీజేపీలోకి ఆశ్చర్యకరంగా చేరికలు పెరుగుతున్నాయి. జాతీయ పార్టీగా ఉన్న బిజెపికి ఏపీలో బలం అంతంత మాత్రమే. కానీ జాతీయస్థాయిలో బీజేపీ అవసరాలు ఉన్నాయి కాబట్టి.. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బిజెపి కోసం పరితపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న టిడిపి, వైసిపి, జనసేనలు బిజెపి స్నేహాన్ని కోరుకుంటున్నాయి. ఇందులో జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాగా, వైసిపి గత ఐదు సంవత్సరాలుగా రాజకీయపరంగా సహకారం అందిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఏపీలో బిజెపికి బలం లేదు కానీ.. బిజెపి ఇచ్చే వెన్నుదన్నుతోనే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావాలని భావిస్తున్నాయి.ఇది విచిత్రకరమైన పరిస్థితి.
జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా బిజెపి మారింది. 1982లో ఈ ప్రక్రియ జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏపీలో అవతరించింది. అప్పటికే బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. అప్పుడే విశాఖ నగరపాలక సంస్థ మేయర్ కు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అదే సమయంలో వాజ్పేయి ప్రత్యేకంగా వ్యూహరచన చేసి డివి సుబ్బారావును మేయర్ అభ్యర్థిగా ప్రకటన చేశారు. ఆ ఎన్నికల్లో బిజెపి గెలుపొందింది. అయితే అదే సమయంలో పురుడు పోసుకున్న టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుంది. అయితే ప్రారంభంలో ఒంటరిగా బరిలో దిగిన బిజెపి చెప్పుకోదగ్గ విజయాన్ని సొంతం చేసుకుంది.కానీ నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఆ పార్టీ ఏపీలో నిలదొక్కుకోకపోవడం లోటే.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బిజెపి ఏపీలో సాధించినది నోటా కంటే తక్కువ ఓట్లు. కేవలం 0.8 ఓట్లను మాత్రమే దక్కించుకుంది. ఒక జాతీయ పార్టీగా ఉంటూ ఈ ఓట్లు దక్కడం ఆ పార్టీకి ఉన్న బలాన్ని తెలియజేస్తోంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండడం, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని విశ్లేషణలు వస్తుండడంతో ఏపీ బీజేపీకి పరపతి తగ్గడం లేదు. పొత్తు ద్వారా కలుపుకెళ్లాలని టిడిపి, జనసేన.. ఎన్నికల అనంతరం సహకారం పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటామని వైసిపి ఆఫర్లు ఇస్తుండడం విశేషం.అందుకే ఇప్పుడు ఏపీలో బలం లేని బిజెపి నిర్ణయాత్మక శక్తిగా మారడం ఆశ్చర్యకరమే.
అయితే పొత్తుల్లో సింహభాగం ప్రయోజనాలను బిజెపి కోరుతోంది. ముఖ్యంగా ఎంపి స్థానాలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా నాలుగు వందల స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి పొత్తులో భాగంగా కీలక ఎంపి స్థానాలను తీసుకోవాలని భావిస్తోంది. వాటిలో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని చూస్తోంది. అందుకేకొద్దిరోజుల కిందట నేతల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పుడు తాజాగా నేతల చేరికలపై దృష్టి పెట్టింది. ఇందులో చాలామంది పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరుతుండడం విశేషం. తాజాగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు బిజెపిలో చేరారు. ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, డాక్టర్ బాలనాగిరెడ్డి, ఐనా బత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీ సబ్బి, రామచంద్రారెడ్డి, కేత అమర్నాథ్ రెడ్డి తదితరులు పురందేశ్వరి సమక్షంలో బిజెపిలో చేరారు. అయితే ఈ చేరికల వెనుక బిజెపి ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.