Hyderabad Collector: రాష్ట్రరాజధాని హైదరాబాద్ జిల్లాకు యంగ్ కలెక్టర్ వచ్చారు. 2018 బ్యాచ్ ఐఏఎస్ అనుదీప్ దురిశెట్టిని కలెక్టర్‌గానియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నగరానికి అతి పిన్నవయడైన అనుదీప్ కలెక్టర్‌గా నియామకం కావడం అందరినీ ఆశ్చర్య పర్చింది. అనుభవజ్ఞుడైన ఐఏఎస్‌ను సహజంగా రాజధానికి కలెక్టర్‌గా నియమిస్తారు. కానీ యువ కలెక్టర్ నియామకం ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
సివిల్స్ టాపర్..
అనుదీప్ 2018 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. హైదరాబాద్ కలెక్టర్‌గా నియామకం కావడంతో తన తల్లిదండ్రులతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈమేరకు సీఎం స్వయంగా కలెక్టర్‌ను ఆహ్వానించారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చాలా మంది యువకులకు అనుదీప్ రోల్ మోడల్ అని కేసీఆర్ కొనియాడారు.
ఐదేళ్లకే హైదరాబాద్ కలెక్టర్‌గా
హైదరాబాద్ కలెక్టర్‌గా ఐఏఎస్‌గా ఎంపికైన ఐదేళ్లకే బాధ్యలు చేపట్టడం ఇదే మొదటిసారని జిల్లా వాసులు, ఐఏఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉన్న అనుదీప్ దురిశెట్టి హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అమోయ్‌కుమార్‌ను హైదరాబాద్ కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతల నుంచి తప్పించారు.
సీఎం ఆదేశాలమేరకేనా..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ప్రభుత్వం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పోలీస్ అధికారులను బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎమ్మెల్యేలు, మంత్రుల సూచనల మేరకు తమతమ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నియమిస్తున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ కలెక్టర్‌గా యువకుడు అయిన అనుదీప్‌ను నియమించాలని సూచించినట్లు తెలుస్తోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం తేడా రాకూడదనే ఉద్దేశంతో సీఎం స్వయంగా సందీప్‌ను కలెక్టర్ కావాలని కోరుకున్నాట్లు తెలుస్తోంది.