Chandrababu: జైలు నుంచి బయటపడాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. బెయిల్ కు కోర్టుల్లో చుక్కెదురవుతోంది. తాజాగా ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ వేయగా.. న్యాయమూర్తి విచారణను ఈ నెల 19 కి వాయిదా వేశారు. ఇంతలో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని కోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబుకు షాక్ తగిలినట్లు అయ్యింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసునకు సంబంధించి చంద్రబాబు ఇంతవరకు బెయిల్ కు పిటిషన్ వేయలేదు. హైకోర్టులో మాత్రం క్వాష్ పిటిషన్ వేశారు. మిగతా కేసుల్లో సిఐడి కస్టడీ కోరగా.. వాటిపై మాత్రం ముందస్తు బెయిలు కోసం పిటిషన్లు వేశారు. కానీ గురువారం ఏసీబీ కోర్టులో మద్యంతర బెయిల్ కోసం పిటిషన్ వేశారు. తన పాత్ర పై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సిఐడి కేసులు నమోదు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీఎస్ ఎస్ డి సి చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు లేదు. కేసులో నా పేరు ఎప్పుడు చేర్చారో కనీసం చెప్పలేదు. ఏ ఆధారాలతో నన్ను నిందితునిగా చేర్చారో చెప్పేందుకు సిఐడి వద్ద ప్రాథమిక వివరాలు లేవు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసును నమోదు చేశారు. అందుకే బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు కోర్టును కోరారు.
దీనిపై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ చేపడితే.. ఆ ప్రభావం క్వాష్ పిటిషన్ పై పడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే కేసు విచారణను ఈనెల 19 కి వాయిదా వేశారు. హైకోర్టులో అదేరోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో సానుకూల తీర్పు వస్తుందని టిడిపి ఆశాభావంతో ఉంది. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని టిడిపి చెబుతోంది. అందుకే హైకోర్టులో బెయిల్ పిటిషన్ కాకుండా క్వాష్ పిటిషన్ వేయడాన్ని గుర్తుచేస్తోంది. అక్కడ కానీ చంద్రబాబుకు అనుకూల తీర్పు వస్తే.. ఈ కేసుల ప్రభావం ఏమీ ఉండదని టిడిపి నేతలు విశ్వసిస్తున్నారు.