కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం కొత స్కీమ్ లను అమలు చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇప్పటికే మోదీ మూడు విడతల్లో రైతుల ఖాతాలలో 2,000 రూపాయల చొప్పున నగదును జమ చేస్తున్నారు. తాజాగా మోదీ కిసాన్ సూర్యోదయ యోజన పథకాన్ని సొంత రాష్ట్రంలో లాంచ్ చేయనున్నారు. ఈ స్కీమ్ కేవలం గుజరాత్ రైతుల కోసం మాత్రమే కావడం గమనార్హం.
భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ స్కీమ్ ను అమలు చేసే అవకాశాలు ఐతే ఉన్నాయని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారని సమాచారం. మోదీ కిసాన్ సూర్యోదయ యోజన పథకంతో పాటు రెండు కొత్త స్కీమ్ లను కూడా లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ స్కీమ్ ను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న స్కీమ్ తరహాలోనే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. కిసాన్ సూర్యోదయ యోజన పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని కొన్ని రోజుల క్రితం గుజరాత్ సీఎం విజయ్ రూపాని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగానే విజయ్ రూపానీ ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత లాంఛ్ చేయించనున్నారు.
ఈ స్కీమ్ లో భాగంగా రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కరెంట్ ఇస్తారు. 3,500 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం విజయ్ రూపానీ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అయితే రాష్ట్రంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ స్కీమ్ ను విజయ్ రూపానీ ప్రభుత్వం అమలు చేయనుంది.