ఏపీలో ఆలయాల చుట్టూ వివాదాలు వీడడం లేదు. ఆలయాలపై దాడులు.. విగ్రహాల ధ్వంసం.. ఆలయాల్లో అపచారాల పరంపర కొనసాగుతోంది. తాజాగా విజయవాడ దుర్గగుడిలో మరో అపచారం చోటుచేసుకుంది. పాలక మండలి సభ్యురాలి మెడకు అక్రమ మద్యం వ్యవహారం చుట్టుకుంది.
Also Read: మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు
తాజాగా విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం దొరికింది. బుధవారం జగ్గయ్యపేటలోని అపార్ట్ మెంట్ పార్కింగ్ లో ఉన్న ఏపీ 16 బీవీ 5577 నంబర్ కారులో పోలీసులు తనిఖీ చేశారు. తెలంగాణలో విక్రయించే మద్యం బాటిళ్లు దొరికాయి. వాటి విలువ సుమారు రూ.40వేల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చినట్టు సమాచారం.
అయితే ఈ వ్యవహారంలో మరోవాదన కూడా తెరపైకి వస్తోంది. విజయవాడ దుర్గగుడి సభ్యురాలి కుమారుడు, కారు డ్రైవర్ శివలు మద్యం బాటిళ్లు తెచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అమెరికా నుంచి వచ్చిన సభ్యురాలి కుమారుడు కోదాడ నుంచి ఈ మద్యం తీసుకొచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జగ్గయ్యపేటలో అక్రమ మద్యం పట్టుబడ్డ కేసులో తనకు , తన కుటుంబ సభ్యులకు ప్రమేయం లేదని విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చెక్కనాగ వరలక్ష్మీ తెలిపారు.. కేసు విచారణ అయ్యేంత వరకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్ ఇలా చేశాడని ఆమె అంటున్నారు.
Also Read: యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చెక్కనాగ వరలక్ష్మీ తాజాగా అక్రమ మద్యం రవాణా కేసులో నైతిక బాధ్యత వహిస్తూ పాలకమండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పాలకమండలి చైర్మన్ కు పంపించారు.