Hemant Soren- KCR: కేంద్రంపై, నరేంద్ర మోడీ విధానాలపై అంతెత్తున ఎగిరి పడుతున్న కెసిఆర్ కు, మరో తోడు దొరికింది. ఇన్నాళ్లు తాను ఒక్కడినే యుద్ధం చేస్తున్నానని చెపుతున్న కెసిఆర్ బాటలో ఆ రాష్ట్ర సీఎం కూడా నడుస్తున్నారు. అయితే బిజెపిని ఇరుకున పెట్టబోయి తానే బొక్క బోర్లా పడుతున్న కేసీఆర్ ను చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి విధానాలకు రూపకల్పన చేస్తారో వేచి చూడాలి. ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమ మైనింగ్ కు సంబంధించి ₹1000 కోట్ల కుంభకోణంలో, దీని వెనుక మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది.. సరిగ్గా దీనికి ఒక రోజు ముందే ఆయన తన అనుయాయులతో వరుస భేటీలు నిర్వహించారు. ఇదే సమయంలో జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించింది.

ఏం చేయబోతున్నారు
మైనింగ్ కుంభకోణంలో సోరెన్ పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఈడీ దర్యాప్తులో విస్మయకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోరెన్ మూడువారాల గడువు కోరారు. అయితే ఈ డీ కూడా అంగీకరించింది.17న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా దానికి రెండు రోజుల ముందే సోరెన్ కేంద్రంపై యుద్ధం ప్రకటించడం గమనార్హం. అయితే ఇదే సమయంలో జార్ఖండ్ లో బిజెపి ఎమ్మెల్యే జై ప్రకాష్ వర్మ సోరెన్ పార్టీలో చేరారు. తనను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులతో ఇబ్బంది పెడుతున్న బిజెపిని ఈ విధంగా చికాకు పెడతానని హెచ్చరికలు పంపారు. మరింతమంది బిజెపి ఎమ్మెల్యేలు తన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి తోడు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఎన్నో పోరాటల ద్వారా 2000 సంవత్సరంలో ఏర్పడ్డ జార్ఖండ్ రాష్ట్రాన్ని బిజెపి ఎక్కువ కాలం పాలించిందని, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కుట్రలు చేసే బిజెపి కావాలా, అభివృద్ధి చేసే ఆదివాసీ, మూలవాసీ కావాలా అని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాచిక ఎంతవరకు పారుతుందో తెలియదు గానీ.. మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న సోరెన్ ఇప్పుడు స్వరం పెంచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.

సోరెన్ వెనుక కాంగ్రెస్
అయితే కేంద్రంపై నిరసనగళం వినిపిస్తున్న సోరేన్ వెనుక కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ఒకవేళ మైనింగ్ కేసులో సోరెన్ అరెస్ట్ అయితే తామే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించవచ్చని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.. అందులో భాగంగానే కేంద్రం పైకి సోరేన్ ను ఎగదోస్తున్నారు. అయితే గురువారం నాటి ఈడీ విచారణ తర్వాత సోరెన్ భవితవ్యం ఏమిటో తేలనుంది. ఇటీవల సీఎం కేసీఆర్ జార్ఖండ్ లో పర్యటించారు..హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు. అక్కడి సైనికులకు చెక్కులు పంపిణీ చేశారు. తర్వాత ఆయన కూడా హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ పెట్టిన బీఆర్ ఎస్ కు మాత్రం మద్దతు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ బాటలో నడుస్తున్నారు.