Kanta Rao Sons: ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు బంగ్లాలో బ్రతికిన స్టార్ హీరో కొడుకులు అద్దె ఇంట్లో ఆర్థిక బాధల నడుమ బ్రతుకీడుస్తున్నారు. జానపద చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కాంతారావు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు సమానమైన స్టార్ డమ్ అనుభవించారు. చిక్కడు దొరకడు మూవీలో ఎన్టీఆర్ తోపాటు మరో హీరోగా నటించారు. స్టార్ హీరోగా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. కత్తి యుద్దానికి తెలుగు హీరోల్లో కాంతారావు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. కాంతారావు గతం ఎంతో ఘనం. లక్షల సంపాదనతో బంగ్లాలో నివసించి, కార్లలో తిరిగారు ఆయన.
అయితే కాంతారావు చేసిన కొన్ని పొరపాట్లు ఆర్థికంగా దెబ్బతీశాయి. నిర్మాతగా మారి ఆయన చేతులు కాల్చుకున్నారు. సంపాదించిన ఆస్తులు అమ్ముకున్నారు. దానికి తోడు హీరో హోదా పోగొట్టుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ సిల్వర్ స్క్రీన్ ఏలుతుంటే కాంతారావు రేసులో వెనుకబడ్డారు. కృష్ణ, శోభన్ బాబు స్టార్స్ గా ఎదిగాక కాంతారావు హీరోగా ఫేడ్ అవుట్ అయ్యారు.
ఒక దశకు వచ్చే నాటికి కాంతారావు దగ్గర చిల్లి గవ్వలేదు. ఆయన జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం వైద్యానికి డబ్బుల్లేని పరిస్థితి. పరిశ్రమలో ఉన్న పరిచయాలతో అడపాదడపా చిత్రాలు చేస్తూ వచ్చారు. 2008లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేసిన పాండురంగడు కాంతారావుకి చివరి చిత్రం. 85 ఏళ్ల వయసులో 2009లో కాంతారావు కన్నుమూశారు. స్టార్ డమ్, డబ్బులు ఉంటేనే గౌరవం అన్నట్లు ఆయన అంత్యక్రియలు కూడా అంతంత మాత్రంగానే ముగిశాయి.
ప్రస్తుతం కాంతారావు కుమారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు చెన్నైలో బంగ్లాలో నివసించిన మేము ఇప్పుడు చిన్న అద్దె ఇంటిలో ఉంటున్నామని అంటున్నారు. సినిమా కోసమే బ్రతికిన నాన్నగారు ఉన్న ఆస్తులు అమ్మి సినిమాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కొడుకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అద్దె ఇంటిలో ఇబ్బందిపడుతున్న మాకు ఇల్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. కాగా కాంతారావు సతీమణి హైమావతి గత ఏడాది కన్నుమూశారు.