Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. ఈసారి ఇసుక కుంభకోణం వంతు

Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. ఈసారి ఇసుక కుంభకోణం వంతు

Chandrababu: చంద్రబాబును వైసీపీ సర్కార్ వెంటాడుతోంది. స్కిల్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించినా.. జగన్ సర్కార్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీలైనంతవరకూ చంద్రబాబును కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. తాజాగా ఆయనపై ఇసుక కుంభకోణం కేసు నమోదు అయ్యింది. ఏపీ ఎండిసి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఏ 1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్ , ఏ 4 గా దేవినేని ఉమాపై సిఐడి కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసింది. అయితే దీనిపై సిఐడి న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ న్యాయస్థానం బెయిల్ వైపే మొగ్గు చూపింది. ఇదే క్రమంలో సిఐడి తాజాగా చంద్రబాబుపై మద్యం కుంభకోణం కేసు నమోదు చేసింది. అయితే చంద్రబాబుకు అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇచ్చిన తరుణంలో అరెస్టు చేయబోమని సిఐడి స్పష్టం చేసింది. కోర్టు సైతం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు హయాంలో ఇష్టారాజ్యంగా సరఫరా చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి.. 1300 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అన్నది ఆరోపణ. అయితే దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ఇప్పుడు తాజాగా ఇసుక కుంభకోణం ఒకటి జరిగిందని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై వీలైనంత కేసులు బనాయించాలన్నదే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారంటూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సైతం పూర్తయింది. తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈనెల 8న తీర్పును వెల్లడించనుంది. ఒకవేళ చంద్రబాబును సమర్థిస్తూ కోర్టు తీర్పు చెబితే ఈ కేసుల నుంచి శాశ్వతంగా చంద్రబాబుకు విముక్తి కలుగునుంది. ప్రతికూల తీర్పు వస్తే మాత్రం ఈ కేసులన్నీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట కేసులతో ఇబ్బంది పెట్టడం ద్వారా.. చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే ప్లాన్ గా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ దక్కడంతో చంద్రబాబుకు స్వల్ప ఉపశమనం దక్కింది. ఇదే సాకుగా చూపి చంద్రబాబు శాశ్విత బెయిల్ పై బయటకు వస్తారేమోనన్న అనుమానంతోనే.. సిఐడి కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్న టాక్ నడుస్తోంది. అయితే సిఐడి దీనిపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కేసు విషయంలో ఏసీబీ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version