AP Volunteer: ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న వాలంటీర్ వివాహితపై అనుచితంగా ప్రవర్తించాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ బలవంతం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి తనను తాను కాపాడుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో వెలుగు చూసింది.
బాపట్ల బాప్టిస్ట్ పాలెంకు చెందిన ఓ వివాహిత అరుగుపై కూర్చుని ఉంది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వాలంటీర్ గాలిమోటు లోక కుమార్ ఆమె వద్దకు వచ్చాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ బాధిత మహిళ ప్రతిఘటించింది. దీంతో ఆమెను కాలితో తన్ని నీ అంతు చూస్తానంటూ.. నన్నెవరూ ఏమీ చేయలేరని.. నా వెంట మోపిదేవి వెంకటరమణ ఉన్నాడంటూ బెదిరించాడు.
స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి బంధువులు, మిత్రులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. వివాహిత పై దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో భయంతో బాధిత మహిళ పరుగు తీసింది. పోలీస్ స్టేషన్లో ఆశ్రయించింది. అయితే సదరు వాలంటీర్ పై గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా ఇలానే వ్యవహరించాడు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పింఛన్లు ఇచ్చేటప్పుడు ఇళ్లల్లోకి వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని.. అందుకే అతని ఇళ్లకు రానీయడం లేదని స్థానికులు చెబుతున్నారు.