Kodali Nani: గుడివాడ.. నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండాలి. కానీ అక్కడ కొడాలి నాని సౌండ్ చేస్తున్నారు. నారా, నందమూరి కుటుంబాలకు కొరకరాని కొయ్యగా మారారు.ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు.నందమూరి కుటుంబానికి తానే వారసుడునని సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే గుడివాడలో తనతో తలపడాలని చాలెంజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో సైతం టిడిపిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన పంతం నెగ్గించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రా కదలిరా పేరిట చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించారు. టిడిపి నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కొడాలి నానికి దెబ్బతీయాలని పథక రచన చేశారు.అయితే దీనికి కొడాలి నాని కౌంటర్ అటాక్ చేయాలని భావించారు. అందుకు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను సాకుగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పోటీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. సరిగ్గా టిడిపి పోలీసులకు అనుమతి కోరిన సమయంలోనే భారీ ర్యాలీకి తెర తీశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఎదురుపడటంతో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో గుడివాడ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో ర్యాలీ నిర్వహణకు తెలుగుదేశం పార్టీ పోలీసుల అనుమతి తీసుకుంది. ఉదయం 11:30 గంటలకు పోలీసులు వారికి సమయం ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఎన్టీఆర్ కు నివాళులర్పించేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో టిడిపి- జనసేన, వైసీపీ శ్రేణులు పరస్పరం ఎదుర్పడ్డాయి. దీంతో వైసిపి కార్యకర్తలు ఒక్కసారిగా కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో తోపులాట జరిగింది. అక్కడ నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. అనంతరం టిడిపి శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించాయి.
అయితే ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలోని వైసీపీ ర్యాలీ కోసం.. టిడిపి ర్యాలీని పోలీసులు అరగంట పాటు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ శ్రేణులకు అనుమతి ఇచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని నిరసిస్తూ టిడిపి ఇన్చార్జ్ వెనిగండ్ల రాము రోడ్డుపై బైఠాయించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తిట్టిన కొడాలి నాని కి ఆయన పేరు తలిచే అర్హత లేదని తేల్చి చెప్పారు. అయినా సరే పోలీసులు అనుమతించలేదు. చివరకు అరగంట పాటు టిడిపి, జనసేన శ్రేణులు వేచి చూడక తప్పలేదు. మొత్తానికైతే కొడాలి నాని తన పంతాన్ని నెగ్గించుకున్నారు.