
Andhra Pradesh: రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక పరిస్థితి విషయంలో ఏ మాత్రం ఆలోచన చేయకపోవడంతో.. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సర్కారు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సివస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్ అందుకు ఠంఛన్ గా నిధులు మంజూరు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పాలన చేపట్టి రెండేళ్లు గడిచింది. అయినా ఇంకా ఆర్థిక పరిస్థితి ఏపీలో ఆందోళనకరంగానే ఉంది. సర్కారు ఉద్యోగులు జీతాల కోసం నెలనెలా కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏపీ(Andhra Pradesh)లో ఇటీవల మరింత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల పెన్షన్లు చాలా మంది చేతుల్లో పడలేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం పెండింగులో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. ఆసరా పథకం కింద రూ.6400 కోట్లు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు మీటా నొక్కే కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తరువాత కొత్త అప్పులు తీసుకునేందుకు అవకాశాలు అభించాయి. దీంతో తీసుకున్న అప్పులతో రెండు, మూడు నెలల పాటు జీతాలు, పెన్షన్లు సమయానికి అందించారు. ఒక్కోసారి రెండుమూడు రోజలు కాస్త ఆలస్యమైనా ఇబ్బంది లేకుండా పోయింది.
కానీ ప్రస్తుతం అప్పుల పరిమితి తీరిపోయింది. కొత్త చిక్కులు ప్రారంభం అయ్యాయి. అదనపు అప్పులకోసం అనుమతి తెచ్చుకున్నా.. అమలు చేయాల్సిన పథకాల భారం మాత్రం పెరిగిపోతోంది. ఈ కారణంగా ప్రభుత్వానికి కొత్త చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆసరా పథకం నిధులు కూడా ఒకేసారి జమ చేయడం లేదు. వేడుకలు నిర్వహించి పదిరోజుల పాటు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. దీంతో జీతాలు, పెన్షలతో పాటు ఆసరా పథకం డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడతాయోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏపీలో నెలకొంది. అయితే కొన్ని రోజులుగా రుణాల కోసం అధికారులు జరుపుతున్న ప్రయత్నాలు విజయవంతం అయితే ఏపీ సర్కారుకు ఆర్థిక కష్టాలు కొంతైనా తీరే అవకాశం లేకపోలేదు.