Homeఆంధ్రప్రదేశ్‌ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

భారత రాజ్యాంగం శాసన వ్యవస్థ కు, న్యాయ వ్యవస్థకు , కార్య నిర్వాహక వ్యవస్థకు విధులు విభజించింది. ఎవరి పరిమితుల్లో వాళ్ళు ఉంటేనే ప్రజాస్వామ్యం నాలుగు కాళ్ళ మీద నిలకడగా వుంటుంది. ఏ కాలు బలహీనపడినా ప్రజాస్వామ్యం బలహీనమైనట్లే. ఇందులో నాలుగో కాలు సమాచార వ్యవస్థ. ఇందులో న్యాయ వ్యవస్థ మీద గురుతర బాధ్యత వుంది. ఇరువైపు వాదనలు విని పరిష్కారం చెప్పటం, నేరం చేసినవారికి శిక్ష విధించటం వీటితో పాటు రాజ్యాంగ పరమైన అంశాలపై వివరణ ఇవ్వటం ప్రధాన విధులు. చరిత్రలో శాసన వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా చట్టాలు చేసినప్పుడు వాటిని సరిదిద్దే బృహత్తర బాధ్యత న్యాయ వ్యవస్థ పై వుంది. అలాగే కార్య నిర్వాహక వ్యవస్థ హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు దాన్ని అదుపులో పెట్టే బాధ్యత అటు శాసన వ్యవస్థకి, ఇటు న్యాయ వ్యవస్థ కి కూడా వుంది. ఈ విధులపై స్పష్టత ఉన్నప్పటికీ ఈ రాజ్యాంగ వ్యవస్థలు శృతి తప్పిన సంఘటనలు చరిత్రలో చాలా వున్నాయి.

ఇటీవలికాలంలో కోర్టులు ప్రతి విషయం లో జోక్యం చేసుకోవటం చూస్తున్నాము. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా ప్రతిదానికి కోర్టుల్లో న్యాయం కోరే ధోరణి కూడా పెరిగింది. సివిల్, క్రిమినల్ సమస్యల్లో ఖచ్చితంగా కోర్టులే తీర్పు చెప్పాల్సి వుంది. అలా కాకుండా రోజువారి ప్రజల సమస్యల్లో ప్రభుత్వం నుంచి న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించటం జరుగుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రజలు ప్రభుత్వం ద్వారా ఉపశమనం పొందనప్పుడు కోర్టుల దగ్గరకు చేరుతున్నరనేది వాస్తవం. అయితే సమస్యల్లా కోర్టులు ఇవి తమ పరిమితిలోకి వస్తాయా రావా అనేది చూసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలిస్తున్నాయి. అంటే రాజ్యాంగం విధించిన గోడల్ని అధిగమించి పనిచేస్తున్నాయని చెప్పాల్సి వుంది. కాకపోతే ఇవి రాజ్యాంగం విధించిన పరిమితుల్లో లేవని చెప్పాల్సింది కూడా కోర్టులే. అందుకే ఈ సున్నితమైన విభజన హద్దులు దాటటం జరుగుతూ వుంది. దీనిపై రాజ్యాంగ నిపుణులు న్యాయ స్థానం అతి చొరవ ( Judicial activism) చూపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : బొత్స మాటలు వింటే నవ్వొస్తుంది… కథలు చిన్నారులకు చెప్పండి!

ఆంధ్ర ప్రదేశ్ వివాదాలు కోర్టుకి 

ఇటీవలి కాలం లో ఆంధ్ర రాజకీయాలన్నీ కోర్టుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిచిన్నదానికి కోర్టులను ఆశ్రయించటం జరుగుతుంది. ఇది మొదట్లో బాగానే అనిపించినా ముందు ముందు మిగతా వ్యవస్థలు బలహీనపడే అవకాశముంది. ముఖ్యమైన రాజధాని విషయం కోర్టుని ఆశ్రయించటం వరకూ సబబే నైనా ప్రభుత్వ గెస్టు హౌస్ కట్టటం పైన కూడా కోర్టులు జోక్యం చేసుకోవటం అతి చొరవ కిందకే వస్తుంది. నిన్నటి వార్తలు చూస్తే ప్రభుత్వ గెస్టు హౌస్ కి అయిదు ఎకరాలు చాలు కదా ముపై ఎకరాలు ఎందుకు అని కోర్టులు ప్రశ్నిస్తే రేపొద్దున ఒక గెస్టు హౌస్ లో ఎన్ని గదులు ఉండాలో కూడా కోర్టులే నిర్ణయిస్తాయి. ఇది న్యాయ వ్యవస్థ అతి చొరవ కి నిదర్శనం. అంతమాత్రాన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకూడదని కాదు. కొన్ని నిర్ణయాలు కోర్టుల పరిధిలోకి ఎలా వస్తాయో అర్ధం కావటంలేదు. ప్రభుత్వం నిజంగా దుబారా చేస్తే అటువంటి నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించాలి, దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి గాని ప్రభుత్వ పరిధిలోని అంశాలను కోర్టులకు బదిలీ చేస్తే ముందు ముందు ఇది ఆనవాయితీగా మారి కార్యనిర్వాహక అధికారాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇవ్వాళ అధికారం లో వున్న పార్టీ శాశ్వతం కాదు. కానీ ఇటువంటి సంప్రదాయాలు శాశ్వతమయితే రాజ్యాంగం ప్రసాదించిన అధికార విధుల సమతుల్యం దెబ్బతింటుంది.

ఇక రాజధాని విషయానికొస్తే దీనిపై హై కోర్టు త్వరగా విచారణ చేపట్టాలి గానీ వాయిదాలమీద వాయిదాలు వేయటం మంచి సంప్రదాయం కాదు. మనకు నచ్చినా నచ్చక పోయినా రాజధాని అంశం శాసన వ్యవస్థకు సంబంధించిన అంశం. న్యాయ వ్యవస్థ శాసించ జాలదు. రాజధాని ని అమరావతి లో పెట్టాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా శాసన వ్యవస్థ కి సంబందించిందే. అటువంటప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని గౌరవించి వుండాల్సింది. పార్టీ లు వేరైనా ప్రభుత్వం అదే కదా. ఆ నిర్ణయం మార్పు మంచి సంప్రదాయం కాదు. కాకపోతే శాసన వ్యవస్థ నే తిరిగి వికేంద్రీకరణ పేరుతో నిర్ణయాన్ని మార్చిన తర్వాత చేయగలిగింది లేదు. ఒకవేళ శాసన మండలి నిర్ణయం సాంకేతికంగా వివాదాస్పదం అయిందనుకున్నా కోర్టులు దానిపై విచారించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది శాసన వ్యవస్థ కి సంబంధించినదీ, అతి ముఖ్యమైనదీ కాబట్టి. శాసన వ్యవస్థ ప్రజల తరఫున విధాన పరమైన, చట్టపరమైన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వ్యవస్థ. రాజకీయంగా చూసినా ఈ సాంకేతిక సమస్య నిలబడేది కాదు. ఇంకో సంవత్సరంలో మండలి లో కూడా అధికార పార్టీ మెజారిటీ కి వచ్చే అవకాశముంది. అప్పుడైనా ఈ నిర్ణయం అమలు జరుగుతుంది. కాబట్టి ఎవరికి  నచ్చినా నచ్చక పోయినా అధికార పార్టీ నిర్ణయం అమలు జరుగుతుంది. కాకపోతే కొన్నాళ్లు ఆలస్యమవుతుంది. సమస్యల్లా ఈ రెండు పార్టీల మధ్యలో రైతులు నలిగిపోతున్నారనేదే. ఈ విషయం లో ప్రభుత్వం భేషిజాలకు పోకుండా రైతులతో మాట్లాడి వాళ్లకు ఏ విధంగా అయితే ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుందో ఆ రకమైన అన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. రాజధాని విషయం వాయిదాలు పడుతూవుంటే రైతుల సమస్య కూడా వాయిదా పడకూడదు. ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.

Also Read : అభిమానుల్లో మిమ్మల్ని కొట్టేవారు లేరు..! జనసైనికులా మజాకా?

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular