ABN RK – Jagan : ఏపీ సీఎం జగన్ ను నచ్చని వ్యక్తుల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు. జగన్ ఏం చేసినా అందులో తప్పులు వెతకడమే ఆర్కే పని. వారాంతపు కామెంట్స్, తన కొత్త పలుకులో ప్రతి అక్షరం జగన్ కోసమే. ఆయనపై విద్వేషపురాతలే. కేవలం జగన్ నిందించడానికి మాత్రమే ఈ కాలమ్ ఉన్నట్టు ఆర్కే రాతలు ఉంటాయి. ఆర్కే రాతలకు తగ్గట్టే జగన్ తప్పులు కూడా ఉండడంతో.. ఈ కాలమ్ అంటేనే పసుపు పార్టీ శ్రేణులు చెవులు కోసుకుంటాయి. చదివి చదివి ఆనంద పడుతుంటాయి. ఈ వారం కొత్త పలుకులో ఆర్కే ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు పై పడ్డారు.
వై ఏపి నీడ్స్ జగన్.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల పది నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమ నిర్వహణను జగన్ యంత్రంగానికి అప్పచెప్పారు. 25 రకాల బుక్ లెట్లతో పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఏకంగా అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం చురుగ్గా జరుగుతుండడంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కోపం వచ్చినట్టుంది. పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం ఏమిటని? ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ఎగురు వేయడం వంటి పనులును తప్పుపడుతూ ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను గంగిరెద్దులతో పోల్చారు. అంతటితో ఆగకుండా పోలిక కోసమే కానీ… ఆ గంగిరెద్దులు ఎంతో గౌరవనీయమని చెప్పుకొచ్చారు. నేరుగా ఎన్నికల అధికారిని కూడా మద్యం కేసులో ఇరికించి, బెదిరించి ఓటర్ల జాబితాలో అవకతవకలు సరి చేయకుండా చూసుకుంటారని కూడా ఆర్కే చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేరుస్తున్నారంటూ ఆర్కే గగ్గోలు పెట్టడం విశేషం.
జగన్ పావలా చేస్తే ఆర్కే రూపాయిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల అధికారిని సిఐడి కేసులో ఇరికిస్తామని బెదిరించడం చిన్న విషయం కాదు. చంద్రబాబుపై ఇటీవల మద్యం కేసును పెట్టారు. ఆ ఎక్సైజ్ శాఖలో గతంలో.. ప్రస్తుత సీఈఓ మీనా పనిచేశారు. దీంతో చంద్రబాబు వలే నీపై కేసులు నమోదు చేయాలా? అంటూ బెదిరిస్తుండడంతో ఓటర్ జాబితాలో తప్పిదాలపై సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్కే గుర్తు చేస్తున్నారు. ఇటువంటి ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్పిస్తున్న జగన్ మరోసారి ఏపీకి అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. పరోక్షంగా తనకు నచ్చిన చంద్రబాబును గెలిపించాలని కొత్త పలుకు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని ఆర్కే భావిస్తున్నారు. పోలీసులు, రౌడీలు, దొంగ ఓటర్లు వంటి ఆయుధాలతో జగన్ ఎన్నికల యుద్ధానికి సిద్ధపడుతున్నారని.. దానిని ప్రజలే ఎదుర్కొని తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించుకోవాలని.. లేకుంటే ఏపీ అనే రాష్ట్రాన్ని మరిచిపోండి అంటూ సెలవిస్తున్నారు. అయితే ఈ మొత్తం కాలమ్ లో అంతిమంగా కనిపించేది మాత్రం తన పాత లక్ష్యమే. ప్రజలను డిక్టేట్ చేసే పనిలో ఆర్కే పడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఈ రాష్ట్రమే ఉండదని.. ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని.. ఇందుకు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలే పనిచేస్తున్నాయని ఆర్కే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరికలు పంపుతున్నారు. అయితే జగన్ అధికారంలోకి వస్తే ముందుగా నష్టపోయేది వారేనని చెప్పుకునేందుకు మాత్రం ఇష్టపడకపోవడం విశేషం.