Andhra Jyothi Senior Journalist: ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిటర్, సీనియర్ పాత్రికేయుడు భళ్లమూడి రామకృష్ణ(54) మృతిచెందారు. కరోనాతో నాలుగు రోజులుగా పోరాడుతూ చివరకు తుది శ్వాస విడిచారు. దీంతో పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారు. కష్టకాలంలో పత్రికకు వెన్నుదన్నుగా ఉన్న ఆయన ఇక లేరనే చేదు నిజం జీర్ణించుకోలేకపోతున్నారు. జీవిత కాలం పత్రికలకే తన సేవలు అంకితం చేసిన ఆయన మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Congress Party: శరణు కోరినవారే భస్మాసూర ‘హస్తం’ అంటున్నారు..!
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన రామకృష్ణ తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. తెలుగు భాషపై మక్కువతో జర్నలిజంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈటీవీ, ఎన్డీవీ, ఐ న్యూస్, వీ6 తదితర చానళ్లలో కూడా అవుట్ పుట్ ఎడిటర్ గా విధులు నిర్వహించి తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. అనర్గళంగా వార్తలు రాయడంలో చదవడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు లేరెవరు పోటీ. ఆంగ్ల పత్రికలైన డక్కన్ క్రానికల్, హాన్స్ ఇండియాలో కూడా పనిచేశారు.

నాలుగేళ్లుగా ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అంతర్జాతీయ వ్యవహారాలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ఆంగ్ల సాహిత్యంలో కూడా పట్టు ఉండటంతో కథనాలు తర్జుమా చేస్తూ తనంటే ఏమిటో నిరూపించుకుంటున్నారు. ఆయనకు భార్య వందన, కమార్తె శ్రీలాస్య ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి అంబర్ పేటలోని శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
పాత్రికేయ రంగంలో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న రామకృష్ణ మృతి పట్ల పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. ఎడిటర్ శ్రీనివాస్, బూదరాజు రాధాకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ స్టా్ కాలేజీ విశ్రాంత పీఆర్వో రాము నివాళులర్పించారు. ఆంధ్రజ్యోతి ఖమ్మం యూనిట్ కార్యాలయంలో టెక్నికల్ ఇన్ చార్జి ఆదిరాజు సూర్యమోహన్ సైతం బుధవారం మధ్యాహ్నం మృతి చెందడం తెలిసిందే.
Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!