Andhra Cricket Association Issue: కేవలం రాజకీయాల్లోనే కాదు.. అన్ని రంగాల్లో పట్టు సాధించాలని వైసీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఆర్థికంగా నాలుగు పైసలు వచ్చే ఏ రంగాన్నీ విడిచిపెట్టడం లేదు. అన్నిరంగాల్లో వేలు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. ఇప్పుడు క్రీడారంగం.. అందునా జనాదరణ ఉన్న క్రికెట్ అసోసియేషన్ పై పడ్డారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబ సంస్థగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మార్చేశారు కూడా. క్రికెట్ అసోసియేషన్ కు దండిగా నిధులు సమకూరుతాయని ఆడిటర్ గా విజయసాయికి తెలుసు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను హైజాక్ చేసుకుంటూ వచ్చారు. అప్పటివరకూ ఏసీఏ పై బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజు హవా నడిచేది. ఆయనకు చెక్ చెబుతూ విజయసాయిరెడ్డి పావులు కదిపారు. కొద్దిరోజులకే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను టేకోవర్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.

దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ మరే క్రీడకు లేదు. పొట్టి క్రికెట్ తో పాటు ఐపీఎల్ వచ్చాక కాసులు కురిపించే క్రీడగా మారిపోయింది. అటు అనుబంధ సంఘాలకు నిధులు పెరిగాయి. బీసీసీఐ నుంచి ఏసీఏకు రూ.40 కోట్ల వరకూ నిధులు వస్తుంటాయి. ఆపై రంజీ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ, క్రీడా మైదానాల ద్వారా వచ్చే ఆదాయం రూ.100 కోట్ల పై మాటే. దీంతో ఏసీఏ పై విజయసాయిరెడ్డి కన్నుపడింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే విజయసాయిరెడ్డి మంత్రాంగంతో గోకరాజు గంగరాజు స్వచ్ఛందంగా దూరమయ్యారు. అదే ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయసాయిరెడ్డి తన సొంత ప్యానెల్ ను పెట్టి గెలిపించుకున్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా తన అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు భరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన వెంకటగిరి రాజ కుటుంబానికి చెందిన వీవీఎస్ఎస్ కేకే యచేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి దుర్గాప్రసాద్ కార్యదర్శిగా, రామచంద్రరావు కోశాధికారిగా ఎంపికయ్యారు. అయితే ఈ రెండు పోస్టులు కీలకం. పైగా గోకరాజు గంగరాజు మనుషులన్న ముద్ర ఉండడంతో విజయసాయరెడ్డి తన మార్కు స్టైల్ తో కొద్దిరోజులకే వారిని ఇంటికి పంపించేశారు. కోశాధికారిగా తన అల్లుడు, కుమార్తె ల కంపెనీలకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డిని నియమించారు.
ఏసీఏ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అసోసియేషన్ పై పూర్తి పట్టు సాధించేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధ్యక్షుడిగా మరోసారి శరత్ చంద్రారెడ్డినే బరిలో దించుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి అరెస్టయ్యారు. అయినా విజయసాయి వెనక్కి తగ్గలేదు. ఇక ఉపాధ్యక్షుడిగా అల్లుడు రోహిత్ రెడ్డిని , ఇప్పటివరకూ కోశాధికారిగా ఉన్న గోపినాథరెడ్డిని కార్యదర్శిగా ప్రమోట్ చేశారు. కోశాధికారిగా ఆడిటర్ చలంతో పోటీచేయిస్తున్నారు. ఈయన విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తెల కంపెనీల వ్యవహారాలు చూస్తుంటారు. ఇలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో కీలకమైన నాలుగు పోస్టులను తన వారితో నింపేశారు విజయసాయిరెడ్డి. సంయుక్త కారదర్శిగా పోటీచేస్తున్న రాకేష్, సైతం అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అటు ఎన్నికల నిర్వహణ కూడా ఆసక్తిగా మారుతోంది. ఇప్పటివరకూ ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఎన్నికల అధికారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని నియమించడం విశేషం.

గత మూడేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పై విజయసాయిరెడ్డి కర్ర పెత్తనం సాగుతోంది. పేరుకే శరత్ చంద్రారెడ్డి అధ్యక్షడు కానీ.. విజయసాయిరెడ్డే అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిందో లేదో… అప్పుడే ఏసీఏ కార్యాలయాన్ని విశాఖ తరలించారు.అటు మంగళగిరిలో నిర్మించతలపెట్టిన గ్రౌండ్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో మూడేళ్లగా పాటు ఏసీఏపై ఆధిపత్యం కొనసాగేలా విజయసాయిరెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.