
Anam and Kotam Reddy in the Assembly: ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. సుడిలో దూకి ఎదురీదకా మనకే సుఖమనుకోవోయ్’ ఇదో విషాద గీతం అయినా చాలా నిగూడార్థం ఇందులో ఉంది. పశ్చాత్తాపం మాటున ఏది జరిగినా మన మంచికేనన్న అర్ధం ఇందులో ఉంది. ప్రధానంగా పార్టీలు మారిన నేతలకు ఇది అచ్చు గుద్దినట్టు సరిపోతోంది. జంపింగ్ జపాంగ్ లు ఎక్కువగా ఉండే రాజకీయరంగంలో కుడి ఎడమలు అధికం. గత అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షంగా ఉన్న నెల్లూరు పెద్దారెడ్డు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పుడు ఆ పార్టీకి ధిక్కార స్వరాలుగా మారిపోయారు. ఇప్పుడు తాజా అసెంబ్లీ సమావేశాల్లో వారి పాత్ర ఎలా ఉంటుందోనన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విపక్షం నుంచి అధికార పక్షంలోకి ఫిరాయించిన వారు దర్జాగా కనిపిస్తారు. కానీ అధికార పక్షం ను ధిక్కరించిన వారు మాత్రం కాస్తా డిఫరెంట్ గా కనిపిస్తారు. అందునా కౌరవ సభలా తలపించే ఏపీ అసెంబ్లీలో వీరు ఎలా వ్యవహరిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ ఇద్దరు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతారని భావించారు. కానీ తాము హాజరవుతున్నామని ప్రకటించి ఏపీలో చర్చకు దారితీశారు.
టీడీపీని విభేదించి వైసీపీ వైపు ఆకర్షితులైన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. అందులో వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రవి ఉన్నారు. ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నా జగన్ సర్కారుకు సై అన్నారు. అక్కడ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి దర్జా వెలగబెడుతూ కనిపిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కొంతవరకూ హుందా మెలుగుతున్నా.. వల్లభనేని వంశీ మాత్రం టీడీపీపైనా, చంద్రబాబుపైనే రియాక్టవుతున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఎలా మసులుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ఆనం రామానారాయణరెడ్డి ఏమంత నోరు తెరిచే చాన్స్ లేదు. కానీ కోటంరెడ్డి విషయంలోనే అసలు తంటా.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాయిస్ ఒకలా ఉండదు. పంచ్ డైలాగులతో రక్తికట్టిస్తారు. ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. ఆ విషయం టీడీపీ నేతలకు, చంద్రబాబుకు తెలియంది కాదు. గతంలో అసెంబ్లీలో కోటంరెడ్డి చంద్రబాబుపై ఒంటి కాలుతో లేచిన సందర్భాలున్నాయి. టీడీపీ నేతల చెంతకు వచ్చి కవ్వింపు చర్యలు చేపట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కుడి ఎడమగా మారింది. ఆ మధ్యన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఇరుకునపెట్టిన కోటంరెడ్డి దాదాపు పార్టీకి దూరమయ్యారు. పేరుకే వైసీపీలో ఉన్నారంటే ఉన్నారు., ఆయనకు అన్నివిధాలా గాలి తీసేశారు. అందుకే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఫోన్ ట్యాపింగ్ తో పాటు నియోజకవర్గ సమస్యలపై గళమెత్తడానికి డిసైడ్ అయ్యారు. అయితే వైసీపీ వ్యూహ చతురత ఆయనకు తెలియంది కాదు. కానీ ఏదో ట్రాప్ లో పడేయాలన్న కసితోనైనా ఆయన తీవ్ర ఆరోపణలు చేసే చాన్స్ ఉంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సరిపోతుంది. తరువాత జరిగే సమావేశాలపైనే అందరి దృష్టి ఉంది. నెల్లూరు పెద్దారెడ్లు స్వరం పెంచుతారో.. లేకుంటే లాస్ట్ సమావేశాల్లో గొడవ ఎందుకని ఊరుకుంటారో చూడాలి మరీ.