BRS: బీఆర్ఎస్ గ్రేటర్లో మాత్రం పట్టు నిలుపుకుంది. నగరంలో గణనీయమైన సీట్లు సాధించింది. తనకు తిరుగులేదని నిరూపించుకుంది. పార్టీ ఆవిర్భావ సమయంలో క్యాడర్, లీడర్లు లేక గ్రేటర్లో అనామక పార్టీగా ఉండిపోయింది. అయితే ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఎదిగింది. తాజా ఎన్నికల్లో ఓటమిపాలైనా.. గ్రేటర్ లో మాత్రం తన పట్టును నిలుపుకోవడం విశేషం.
2004 ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తొలిసారిగా నగరంలో బరిలో నిలిచింది. రెండు చోట్ల గెలుపొందింది. 2009 ఎన్నికల్లో టిడిపి వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకుంది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. 2014 ఎన్నికల నుంచి మాత్రం సత్తా చాటుతూ వచ్చింది. ఓట్లు, సీట్లు పెంచుకుంది.
గ్రేటర్ లో 29 నియోజకవర్గాలకు గాను ఏకంగా 18 స్థానాల్లో టిఆర్ఎస్ గెలుపొందడం విశేషం. గత ఎన్నికల్లో ఎల్బీనగర్,మహేశ్వరం కాంగ్రెస్ గెలుపొందగా.. బీఆర్ఎస్ ఖాతాలో ఆ రెండు స్థానాలు పడ్డాయి. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఒక సీటు తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా.. గ్రేటర్ లో అత్యధిక సీట్లు పొందడం ఉపశమనం కలిగించే విషయం.