Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబుపై మోపబడిన ఇతర కేసుల విషయంలో సైతం వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్కిల్ స్కాంలో తన అరెస్టులో సిఐడి నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై కేసులు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అక్టోబర్ 20న తుది విచారణ పూర్తయింది. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించలేదు. నవంబర్ 8న వెల్లడిస్తామని చెప్పినా.. ఈరోజు వరకు రిజిస్ట్రీ కాలేదు. దీంతో తీర్పు వెల్లడించలేదు.
తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పై విచారణ జరిగింది. అయితే ఈ నెల 30కు విచారణను వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు తీర్పు విషయంలో కూడా స్పష్టతనిచ్చింది. సెక్షన్ 17 ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక.. ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే స్కిల్ స్కాంలో తుది తీర్పును దీపావళి తర్వాత వెల్లడిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టతనిచ్చింది. తాజాగా ఫైబర్ నెట్ కేసు సైతం 17a సెక్షన్ పరిధిలో ఉండడంతో.. స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారణ చేపడతామని తెలిపింది. అయితే కేసు ముగిసే వరకు అరెస్టు చేయవద్దన్న విన్నపాన్ని మన్నించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్ర కోరారు. గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేయాలని తొలు త ధర్మాసనం నిర్ణయించింది. అయితే సిద్ధార్థ లూద్ర విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. దీంతో క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించిన టిడిపి శ్రేణులకు నిరాశే మిగిలింది. వారికి మరికొన్ని రోజులు పాటు ఎదురుచూపులు తప్పలేదు.