Atrocity In Podugupalem: యథా రాజా తథా అధికారి అని చదువుకోవాలేమో? తాతల కాలం నుంచి రైతుల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షసంగా మారింది. పేదల నుంచి భూములు లాక్కునేందుకు ఇదే ధోరణి అనుసరిస్తారా? వైఎస్ జగన్ సర్కారు చేసిన పనికి ఓ మహిళ తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి దురాగాతాలకు తెగబడటం అందరిలో అసహ్యం కలిగేలా చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రాక్షస పాలన కొనసాగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో చోటుచేసుకున్న ఉదంతం అందరికి భయాందోళన కలిగేలా చేసింది.

ప్రభుత్వం నేతృత్వంలోనే దాడులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల కోసం ప్రభుత్వం ఉందా? భూములు లాక్కోవడమే తమ హక్కుగా భావిస్తుందా తెలియడం లేదు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని పొడుగుపాలెం గ్రామంలో జరిగిన దారుణం అందరిలో ఆవేశం కలిగేలా చేస్తోంది. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి జేసీబీతో ఓ మహిళ మృతికి కారణం కావడం సంచలనం కలిగించింది. స్థలం లాక్కునేందుకు అవసరమైతే ప్రాణాలు కూడా తీసేందుకు సిద్ధమనే కోణంలో వారి ప్రవర్తన ఉండటం గమనార్హం.
గ్రామంలో అంగన్ వాడీ భవన నిర్మాణానికి ఓ స్థలం చూశారు. అది రైతుల చేతుల్లో ఉంది. రైతులు తమ ఎడ్లను కట్టేసుకునే పశువుల పాకగా చేసుకుని స్థలాన్ని వారి తాతల కాలం నుంచి వాడుకుంటున్నారు. అయితే ఇటీవల అధికారులు అది ప్రభుత్వ స్థలం అంటూ దాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారయంత్రాంగంతో వచ్చారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమదేనంటూ వాదానికి దిగారు. దీంతో అధికారులు జేసీబీతో పనులు చేపట్టారు. దీనికి అడ్డు తగిలిన ఎల్లమ్మ అనే మహిళను దాంతోనే తొక్కించి చంపేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అధికార యంత్రాంగం ఇంతకు తెగిస్తుందా? అని స్థానికులు ఆందోళన చెందారు. మహిళ ప్రాణాలు పోయేలాచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అధికారుల కండ కావరానికి పరాకాష్టగా చెబుతున్నారు. వైఎస్ జగన్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిర్వాకం వివాదాలకు కేంద్రంగా మారింది.
దీనిపై జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తహసీల్దార్ రామారావు పేర్కొన్నారు. భూమి చదును చేస్తుంటే ఆమె కావాలనే దానికి అడ్డంగా వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఆమె చనిపోయిందని అన్నారు. స్థానికులు అడ్డు వచ్చినా పనులు కొనసాగించడంతో వృద్ధురాలు చనిపోయిందని చెప్పారు.