
Amit Shah: ఉత్తరాది పార్టీగా ఉన్న మచ్చను పోగొట్టుకునేందుకు భారతీయ జనతాపార్టీ దక్షిణాదిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో రెండుసార్లు విజయం సాధించి అధికారంలోకి వచ్చినా.. ఇతర రాష్ట్రాల్లో పాగా వేయలేకపోతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నట్లు కమలనాథులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పు కాకపోతే ఇక ఎప్పుడూ కాదన్న వ్యూహంతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీలో నంబర్ 2గా ఉన్న అమిత్‌షా ఇందుకు వ్యూహాలు రచిస్తుండగా నంబర్ 3గా ఉన్న సునీల్ బన్సల్ స్ట్రాటజీ రూపొందిస్తున్నారు. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనేది బీజేపీ లక్ష్యం. తానే స్వయంగా తెలంగాణ బాధ్యతలను పర్యవేక్షించాలని అమిత్‌షా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: Malla Reddy: వామ్మో.. మల్లన్న.. ఆయకు టికెట్ ఇస్తే అంతేనట!
కర్ణాటక ఎన్నికల తర్వాత కదనరంగంలోకి..
ఈ మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తరువాత అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. తెలంగాణలోనే మకాం వేసి.. ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 12న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆ తరువాత మరిన్ని పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయం.
ప్రధాని పర్యటనలు ఉండేలా ప్లాన్..
అన్ని జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించి రాష్ట్రస్థాయి బహిరంగ సభలు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, బీఎల్.సంతోష్ నిరంతరం తెలంగాణ రాజకీయ వ్యవహారం పైన మంతనాలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నేతలకు మార్గ నిర్దేశం కొనసాగిస్తున్నారు.

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్వయంగా తెలంగాణ పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. దక్షిణాదిన రెండు కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న కర్ణాటక.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ కు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక బాధ్యత తీసుకున్న అమిత్‌షా..
కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవటం బీజేపీ అధినాయత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అక్కడ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలే ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అక్కడ అధికారం కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అమిత్‌షా కర్ణాటకలో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. నిరంతరం రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికల కోసం స్కెచ్ రెడీ చేస్తూనే ఇటు తెలంగాణలోనూ పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
ముందుగా కర్ణాటక.. తరువాత తెలంగాణలో..
కర్ణాటక–తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా అమిత్ షా కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా ఆపరేషన్ ముందుగా కర్ణాటకలో, తర్వాత తెలంగాణలో ∙ప్రారంభం కానుంది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవటమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే తమ లక్ష్యం ఏంటో తెలంగాణ నేతలకు బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింద. పార్టీలో చేరికలు లేకపోవటం పైన ఆరా తీసింది. చేరిక సమయంలో నేతలకు ఇచ్చే హామీల అమలు దిశగా స్వేచ్ఛను ఇచ్చింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత మార్పు కనిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ మరింత అప్రమత్తం అయింది. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలకు ఎప్పటికప్పడు రూట్ మ్యాప్ అందిస్తున్నా.. స్వయంగా తానే రంగంలోకి దిగాలని అమిత్ షా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. ఇందు కోసం ఆయన తెలంగాణలోని ప్రతీ జిల్లాలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మొత్తంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారని సమాచారం. మరి.. ఈ ముగ్గురి వ్యూహాలు తెలంగాణలో ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read: Actress Sri Divya : కార్తీకదీపం నటి బాత్ రూం ఫొటోలు లీక్.. వైరల్