Amit shah vs Prashant Kishor: ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేయడంలో ఎవరికి వారే దిట్ట. కేంద్ర హోం మంత్రి అమిత్ షాది ఒక స్టైల్ అయితే ప్రశాంత్ కిషోర్ ది మరో పద్దతి. అయితే పలు సందర్భాల్లో వీరి శక్తియుక్తుల గురించి కామెంట్లు వచ్చినా అధికారంలో ఉండి వ్యూహాలు ఖరారు చేయడం కాదు అధికారంలో లేనప్పుడు చేయడమే గొప్ప అని ప్రశాంత్ కిషోర్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు వారిద్దరు కలిసి పనిచేసే సన్నివేశం ఆవిష్కృతం కానుంది. దీంతో ఎవరు గొప్పో ఎవరు కాదో నిరూపితం కానుంది. గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు పీకే ఓకే చెప్పారని తెలుస్తోంది
పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఓటమికి టీఎంసీ గెలుపునకు పీకే ప్రధాన భూమిక పోషించినట్లు తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ అమిత్ షా స్వరాష్ట్రం కావడంతో ఇక్కడ పీకే వ్యూహాలు ఫలిస్తాయా? లేక అమిత్ షా శక్తులే ప్రభావం చూపుతాయా? అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. పీకేను వ్యూహకర్తగా పెట్టుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గుజరాత్ లో ఎవరి బలమెంతో తెలియనుంది.
Also Read: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో కీలక మార్పులు.. నిబంధనలివీ
గతంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల తరువాత ఇక వ్యూహకర్తగా పనిచేయనని పీకే ప్రకటించారు. అప్పుడు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కూడా సాగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోలేదు. కానీ గుజరాత్ లో మాత్రం కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చుతాననే సంకల్పంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి హేమాహేమీల పోటీలో గుజరాత్ ఎవరి వశం అవుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.
గుజరాత్ రాజకీయాలు రెండు పార్టీలకు చాలెంజింగ్ గా మారనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ సమరోత్సాహంతో ఉన్నాయి. పీకే వ్యూహాలే మాకు బలమని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. ఎందరు పీకేలొచ్చినా పీకిపారేస్తామని అమిత్ షా రెడీ అయ్యారు. దీంతో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో రాజకీయ సంగ్రామంగా గుజరాత్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరి బలం పని చేస్తుందో? ఎవరి వ్యూహాలు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.
రాహుల్ గాంధీ సూచనల మేరకు పీకే టీం ఐప్యాక్ తో రంగంలోకి దిగనుంది. కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు అమిత్ షా సైతం తమ పార్టీ గెలుపు కోసం ప్రజలను ఆకట్టుకునేందుకు పాచికలు సిద్ధం చేస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునే క్రమంలో ఆయన మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో గుజరాత్ సంగ్రామంలో విజయమెవరిదో ఎన్నికల వరకు ఆగాల్సిందే.
Also Read: విద్యుత్ చార్జీల పెంపును టార్గెట్ చేసుకున్న బీజేపీ.. టీఆర్ఎస్ పై ప్రతీకారం