America : వలస విధానాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అమెరికా హౌస్ జ్యుడిషియరీ కమిటీకి సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (CIS) సమర్పించిన కొన్ని ముఖ్యమైన సిఫారసులు ట్రంప్ మార్చిలో ప్రవేశపెట్టే ప్రధాన వలస బిల్లులో భాగం అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
1. ప్రతిపాదిత మార్పులు ఇవే!
డాకా లబ్ధిదారులకు పౌరసత్వ మార్గం:
DACA (Deferred Action for Childhood Arrivals) కార్యక్రమాన్ని మరింత విస్తరించడంతో పాటు, లబ్ధిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం చేయనున్నట్లు ప్రతిపాదనలు ఉన్నాయి.
2. H1B వీసాల కాల పరిమితి:
ప్రస్తుతం H1B వీసా గడువు 6 సంవత్సరాల వరకు పొడిగించుకునే వీలుంది. అయితే, ఈ బిల్లులో H1B వీసాను 2 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని, మరింత ప్రతిభావంతులైన కొందరు వ్యక్తులకు మాత్రమే మరో 2 సంవత్సరాల పొడిగింపు కల్పించాలని ప్రతిపాదించారు.
3. H1B వీసాల కేటాయింపు విధానంలో మార్పు:
ఇప్పటి వరకు H1B వీసా లాటరీ పద్ధతిలో కేటాయించబడుతున్న విషయం తెలిసిందే. కానీ, వీటిని వేలం (auction) విధానంలో మంజూరు చేయాలని కొత్త ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంటే, అత్యధిక ధర చెల్లించగల సంస్థలు మాత్రమే H1B వీసాలను పొందగలవు.
4.I-140 ఆధారిత పొడిగింపుల రద్దు:
ప్రస్తుతం గ్రీన్ కార్డ్ కోసం I-140 అప్లికేషన్ దాఖలు చేసిన వారు H1B వీసాను నిబంధనల ప్రకారం పునరుద్ధరించుకోవచ్చు. అయితే, ఈ కొత్త బిల్లులో I-140 ఆధారిత పొడిగింపును పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. అంటే, గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న వలసదారులకు ఇది తీవ్రమైన ఎదురు దెబ్బ అవుతుంది.
5.వీసాల మొత్తం పరిమితిపై కఠిన నియంత్రణ:
ప్రస్తుతం H1B (అత్యధికంగా 85,000 మందికి మంజూరు చేయబడుతుంది), H1B కాప్ ఎగ్జెంప్ట్ (నియంత్రణ లేకుండా మంజూరవుతుంది), L1 వీసాల సంఖ్య కలిపి లక్షల్లో ఉంటోంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం ఇవి అన్నీ కలిపి గరిష్టంగా 75,000 వీసాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు.
6. H4 EAD (Employment Authorization Document) తొలగింపు:
ప్రస్తుత విధానం ప్రకారం, H1B వీసా గ్రహీతల జీవిత భాగస్వాములకు H4 EAD ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అయితే, ఈ అవకాశాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. దీంతో, వేలాది మంది భారతీయ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
7. OPT (Optional Practical Training) పై పరిమితులు:
ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లోని అంతర్జాతీయ విద్యార్థులకు 1 సంవత్సరం OPT, అలాగే STEM (Science, Technology, Engineering, Mathematics) కోర్సుల్లో ఉన్న వారికి అదనంగా 2 సంవత్సరాల పొడిగింపు లభిస్తోంది. అయితే, ఈ పొడిగింపును పూర్తిగా తొలగించి, OPTను కేవలం 1 సంవత్సరానికి పరిమితం చేయాలని ప్రతిపాదించారు.
భారతీయ వలసదారులపై తీవ్ర ప్రభావం!
ఈ ప్రతిపాదనలు అమలవుతాయా లేదా అనేది మార్చిలో ట్రంప్ ప్రవేశపెట్టే బిల్లుపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ మార్పులు ప్రధానంగా భారతీయ వలసదారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా, H1B వీసా గడువు తగ్గిపోవడం, H4 EAD రద్దు కావడం, I-140 పొడిగింపులు లేకపోవడం భారతీయ ఐటీ ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు. ఇదే సమయంలో, DACA లబ్ధిదారులకు పౌరసత్వ మార్గం కల్పించడంతో, లాంగ్ టర్మ్ గా అమెరికాలో స్థిరపడాలనుకునే వలసదారులకు ఇది కొంత ఊరట కలిగించే పరిణామం కావొచ్చు.
మార్చి బిల్లు – రాజకీయంగా కీలకమైన దశ!
ట్రంప్ త్వరలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనున్న నేపథ్యంలో ఈ వలస విధాన మార్పులు అనేక రాజకీయ కలకలాలను రేపే అవకాశం ఉంది. మరి, ఈ బిల్లును కాంగ్రెస్‌లో అనుమోదిస్తారా లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Americas immigration policies in donald trump
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com