Afganistan Crisis : ఆప్ఘనిస్తాన్ పై అమెరికా కీలక ప్రకటన!

అమెరికా సైన్యాలు ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి వ‌దిలి వెళ్ల‌డం పూర్తికాకుండానే.. దేశాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం మొద‌లు పెట్టిన తాలిబ‌న్లు.. గ‌త ఆదివారంతో దాదాపుగా ప‌ని పూర్తిచేసేశారు. రాజ‌ధాని కాబూల్ ను తాలిబ‌న్లు ఆక్ర‌మించ‌డం.. దేశ అధ్య‌క్షుడు దేశం విడిచి పారిపోవ‌డంతో ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారిపోయింది. ఇక‌, తాలిబ‌న్లు అధికారికంగా ప‌గ్గాలు చేప‌ట్ట‌డ‌మే మిగిలి ఉంది. అయితే.. దేశంలో మ‌రోసారి అరాచ‌క పాల‌న ప్రారంభం కాబోతోంద‌న్న భ‌యం ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అమెరికా విమానం రెక్క‌ల‌పై కూర్చొని, […]

Written By: Bhaskar, Updated On : August 17, 2021 1:41 pm
Follow us on

అమెరికా సైన్యాలు ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి వ‌దిలి వెళ్ల‌డం పూర్తికాకుండానే.. దేశాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం మొద‌లు పెట్టిన తాలిబ‌న్లు.. గ‌త ఆదివారంతో దాదాపుగా ప‌ని పూర్తిచేసేశారు. రాజ‌ధాని కాబూల్ ను తాలిబ‌న్లు ఆక్ర‌మించ‌డం.. దేశ అధ్య‌క్షుడు దేశం విడిచి పారిపోవ‌డంతో ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారిపోయింది. ఇక‌, తాలిబ‌న్లు అధికారికంగా ప‌గ్గాలు చేప‌ట్ట‌డ‌మే మిగిలి ఉంది. అయితే.. దేశంలో మ‌రోసారి అరాచ‌క పాల‌న ప్రారంభం కాబోతోంద‌న్న భ‌యం ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అమెరికా విమానం రెక్క‌ల‌పై కూర్చొని, ప్ర‌యాణించే సాహ‌సానికి కూడా అక్క‌డి జ‌నం ప్ర‌య‌త్నించారంటే వారిలో ఉన్న భ‌యాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఊహ‌కంద‌ని ఈ సాహ‌సంలో విమానం నుంచి జారిపడి ఇద్ద‌రు చనిపోవ‌డం యావ‌త్ ప్ర‌పంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో.. అమెరికా తీసుకున్న నిర్ణ‌యంపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ స్పందించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ విష‌యంలో త‌మ వైఖ‌రి ఏంట‌న్న‌ది స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. 2001లో త‌మ దేశంపై జ‌రిగిన దాడికి ప్ర‌తీకారంగా ఆల్ ఖైదా ఉగ్ర‌వాద సంస్థ‌పై దాడి చేసేందుకే ఆప్ఘ‌న్ చేరుకున్న‌ట్టు చెప్పారు. అనుకున్న‌ట్టుగానే ఆల్ ఖైదా ప్రాబ‌ల్యం త‌గ్గించామ‌ని, దాంతో త‌మ మిష‌న్ కంప్లీట్ అయ్యింద‌ని చెప్పారు. అంతేత‌ప్ప‌.. ఆప్ఘ‌నిస్తాన్ లో ప్ర‌జాస్వామ్యాన్ని స్థాపించ‌డం అనేది అమెరికా ల‌క్ష్యం కాద‌ని అన్నారు.

ఆప్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికాపై దాడి జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డ‌మే త‌మ ఎజెండా అన్నారు. ఆప్ఘ‌నిస్తాన్ లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను మార్చ‌డం, అక్క‌డ ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్ట‌డం త‌మ ప‌ని కాద‌ని అన్నారు. అంతేకాదు.. త‌మ‌కు సంబంధం లేని యుద్ధంలో అమెరికా సైనికులను కోల్పోవ‌డానికి తాము సిద్ధంగా లేమ‌ని కూడా తేల్చి చెప్పారు. ఆప్ఘ‌నిస్తాన్ కోసం ఇప్ప‌టికే భారీగా డ‌బ్బు ఖ‌ర్చు చేశామ‌ని, అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించామ‌ని కూడా చెప్పారు. కానీ.. పోరాడాల‌నే సంకల్పాన్ని మాత్రం ఆప్ఘ‌న్ల‌లో నింప‌లేక‌పోయామ‌ని అన్నారు.

ఆప్ఘ‌నిస్తాన్ లో ఇంకా ఎంత కాలం ఉంటే.. స‌రైన ప‌రిస్థితులు వ‌స్తాయో చెప్ప‌లేకుండా ఉంద‌న్నారు. అందువ‌ల్ల ఆప్ఘ‌న్ నుంచి అమెరికా ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించ‌డానికి స‌రైన స‌మ‌యం అనేది లేద‌నే విష‌యాన్ని తాము గ్ర‌హించామ‌న్నారు. అయితే.. తమ సైన్యాలు ఆప్ఘ‌న్ ను వీడితే ఏం జ‌రుగుతుందో తాము ఊహించామ‌ని, కానీ.. మ‌రీ ఇంత వేగంగా ప‌రిస్థితులు దిగ‌జారిపోతాయ‌ని అనుకోలేద‌న్నారు. ఆప్ఘ‌న్ దేశ నాయ‌కులు చేతులెత్తేసి, దేశం విడిచి పారిపోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

కాగా.. దాదాపు 20 సంవ‌త్స‌రాల‌పాటు అమెరికా సైన్యం ఆప్ఘ‌న్ లో ఉంది. 2001 సెప్టెంబ‌ర్ లో అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పై ఆల్ ఖైదా జ‌రిపిన విమాన దాడుల‌తో ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోయింది. దీంతో.. ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆప్ఘ‌న్ లో అడుగు పెట్టింది అమెరికా సైన్యం. ఈ మిష‌న్ ను కంప్లీట్ చేసింది కూడా. లాడెన్ ను చంపేసిన త‌ర్వాత కూడా చాలా ఏళ్లు అక్క‌డే ఉంది. ఈ క్ర‌మంలో వేలాది మంది సైనికులను, మిలియ‌న్ల కొద్దీ డాల‌ర్ల‌ను కోల్పోయింది. దీంతో.. ఇక అక్క‌డ సైన్యాన్ని ఉంచ‌డం స‌రికాద‌ని అమెరికా నిర్ణ‌యించుకుంది. గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఈ మేర‌కు తాలిబ‌న్ల‌తో ఒప్పందం కుదిరింది. దాని ప్ర‌కార‌మే.. ఇప్పుడు ఆఫ్ఘ‌న్ ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. దీంతో.. తాలిబ‌న్లు దేశాన్ని ఆక్ర‌మించుకుంటున్నారు.