Ambati Rambabu: తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు గట్టి హెచ్చరికలు పంపారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సినిమాలో పాత్రలు, పాత్రధారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్యారెక్టర్లు సృష్టించే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమాలో తనను పోలిన పాత్రను క్రియేట్ చేయడంపై అంబటి రాంబాబు స్పందించారు. ఎవరిపైనైనా కక్షపూరితంగా క్యారెక్టర్లు క్రియేట్ చేసి సినిమాలు తీసే నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు,సినీ రచయితలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకు, నటులకు, దర్శకులకు
.. త్రివిక్రమ్ లాంటి మాటల రచయితలకు మీడియా ద్వారా హెచ్చరిస్తున్నట్లు చెప్పి మరి వార్నింగ్ ఇచ్చారు. ఇలా మళ్లీ చేస్తే గుణ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని.. తన మాటలను అర్థం చేసుకోవాలని సినీ రంగ ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నా అంటూ గట్టి సంకేతాలు పంపారు.
అయితే వ్యూహం సినిమా విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సైతం అంబటి ద్వారా గట్టి దెబ్బే తగిలింది. వ్యూహం సినిమాలో విపక్ష నేత చంద్రబాబు, పవన్ పాత్రలను ప్రతికూలంగా చూపించే పనిలో ఆర్జీవి ఉన్నారు. ఈ పాటికే ట్రైలర్లో ఈ విషయం అర్థమైంది. ఇప్పుడు అంబటి హెచ్చరికలతో ఆ పాత్రలను మార్చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే వ్యూహం సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ చాలాసార్లు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి వచ్చారు. ఈ సినిమాలో జగన్ పాత్రను అనుకూలంగా చూపించి.. విపక్ష నేతలను ప్రతికూలంగా చూపించేందుకు ఆర్జీవి ప్రయత్నిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు వ్యూహం సినిమాను దెబ్బతీసేలా ఉన్నాయి. అంబటికి దమ్ముంటే వ్యూహం సినిమాపై మాట్లాడాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.