Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మళ్లీ కథ మొదటికొచ్చింది. నిన్న మూడు రాజధానుల బిల్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా సీఎం జగన్ మాత్రం మరో వివాదానికి తెర లేపడం సంచలనం కలిగిస్తోంది. మరోమారు మెరుగైన బిల్లు ప్రవేశపెడతామని ఆయన చేసిన ప్రకటనతో అందరిలో అయోమయం నెలకొంది. ఏపీకి రాజధాని ఏది అనే విషయంపై స్పష్టత కానరావడం లేదు. అమరావతా? లేక ఇంకా వేరే ఏదైనా సూచిస్తారా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అవుతోంది.

చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతిగా చేసుకుని అభివృద్ధి చేసినా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అది ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ఆయన తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటూ రాజధాని విషయంలో తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. కానీ రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో రెండేళ్లుగా పలు కోణాల్లో నిరసనలు పెరిగాయి.
దీంతో మూడు రాజధానుల వ్యవహారంపై ఆలోచించి బిల్లు రద్దు చేసినా మరో పీటముడి వేసి ప్రజల్లో గందరగోళానికి తెరలేపారు. జగన్ చేసిన ప్రకటనతో అందరిలో సంశయాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రస్తావనతో జగన్ పై సహజంగానే విమర్శలు వచ్చాయి. దీంతో పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లు రద్దు చేసి ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కాలని చూసిందని తెలుస్తోంది.
Also Read: Janasena: ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే! వరద బాధితుల వద్దకు పవన్
కానీ జగన్ ప్రకటనతో మళ్లీ రాజధాని ఏదనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అమరావతినే ప్రకటిస్తారా? లేక విశాఖను రాజధానిగా చేస్తారా అనే వాదన అందరిలో వస్తోంది. అయితే జగన్ నిర్ణయం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ ప్రవర్తన ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమస్యను పరిష్కరించకుండా పక్కదారి పట్టించి చోద్యం చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒక దాన్ని రాజధానిగా ప్రకటించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Pawan Kalyan: నవ్యాంధ్ర ఏర్పడి ఏడున్నరేళ్లు.. రాజధాని ఎక్కడ.. లాజిక్ తో కొట్టిన పవన్