NTR vs Pawan Kalyan – BJP: రాజకీయంగా బలపడాలని అన్ని రాజకీయ పక్షాలు చూస్తాయి. కానీ అవి వెళ్లే మార్గం బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడడానికి ప్రయత్నిస్తోంది. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూనే తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీ భీకర యుద్ధంచేస్తోంది. అందుకే విపక్షాల నుంచి పెద్దఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో తటస్థులను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా సినీ గ్లామర్ తో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ తో స్నేహం కొనసాగిస్తోంది. పవన్ తో పొత్తుకు సుముఖంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరపడం అందులో భాగమేనన్న ప్రచారం నడుస్తోంది. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన నటనకు మెచ్చి అమిత్ షా కలిశారని బయటకు ప్రచారం జరుగుతున్నా.. ఎన్టీఆర్ ను బీజేపీలో చేర్చుకునేందుకేనన్న టాక్ అయితే వినిపిస్తోంది.

ఏపీలో బలపడాలని…
తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలమైన రాజకీయ పక్షంగా అవతరించే ప్రయత్నంలో ఉంది. ఇందులో కొంత సక్సెస్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దెదించి పవర్ లోకి రావాలని ప్రణాళిక రూపొందించింది. అయితే ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. సుమారు ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి..చాలా రాష్ట్రాల్లో పార్టీ విస్తరించింది. ఆయా రాష్ట్రాలను హస్తగతం చేసుకుంది. కానీ ఏపీ విషయానికి వచ్చే సరికి మాత్రం బీజేపీకి పట్టు దొరకడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం జరగడం లేదు. అందుకే పవన్ రూపంలో ఒక అవకాశాన్ని బీజేపీ ఉంచుకుంది. తద్వారా కాపుల ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నంలో అయితే ఉంది. దీనికితోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు అప్పగించింది,. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించాలన్నదే బీజేపీ వ్యూహం. ఇప్పటికే ఎన్టీఆర్ కుమార్తె పురేందేశ్వరి బీజేపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా ఉన్నారు. వారికి జూనియర్ ఎన్టీఆర్ తోడైతే కమ్మ సామాజికవర్గం వారు కలిసివస్తారని అంచనా వేస్తోంది. అటు కాపు, ఇటు కమ్మ సామాజికవర్గం తోడైతే వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా.. లేకపోయినా గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవచ్చన్నది బీజేపీ వ్యూహం.
పవన్ తో పొత్తు ఉన్నా..
అయితే పవన్ తో స్నేహం విషయంలో బీజేపీకి ఇటీవల క్లారిటీ తప్పుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ గంటాపధంగా చెబుతున్నారు. బీజేపీ వ్యవహార శైలి చూస్తే భిన్నంగా ఉంది. తనతో స్నేహంగా ఉంటూనే జగన్ తో కేంద్ర పెద్దలు మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. ఇది పవన్ కు మింగుడుపడడం లేదు. బీజేపీ కంటే ఆయన టీడీపీతోనే కలిసి నడిచేందుకు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీని ఎదుర్కొవాలంటే బీజేపీకి ఉన్న బలం సరిపోదని పవన్ ఒక అంచనాకు వచ్చారు. అందుకే బీజేపీ లేకపోయినా టీడీపీ తో కలిసి వైసీపీని ఢీ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీని కలిపేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తారని.. విఫలమైతే మాత్రం ఆయన టీడీపీ వైపే మొగ్గుచూపుతారని ప్రచారం బాగా నడుస్తోంది.

ఎన్టీఆర్ సాహసం చేస్తారా?
అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీవైపు వచ్చే అవకాశమే లేదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బీజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశంచేస్తారా? అన్న అనుమానం అయితే ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వయసు 39.వచ్చే ఎన్నికల నాటికి 41 సంవత్సరాలవుతాయి. 2029 నాటికి ఆయన 46 సంవత్సరాలకు చేరుతారు. అదే సమయానికి చంద్రబాబు వయసు 79 ఏళ్లు అవుతాయి. అప్పటికీ ఆయన క్రియాశీకలంగా తగ్గే అవకాశాలుంటాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు అందుకునే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు తనవేనని ఎన్టీఆర్ భావిస్తుంటారని సన్నిహితులు చెబుతుంటారు. అటువంటిది బీజేపీ వైపు వెళ్లి చేయ్యి కాల్చుకోరని వారు భావిస్తున్నారు. ఇన్ని విశ్లేషల నడుమ అటు పవన్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను నమ్ముకొని పార్టీని బలోపేతం చేయాలన్న బీజేపీ పెద్దల ప్రయత్నాలు పెద్దగా ఫలించే పరిస్థితులైతే కనిపించడం లేదు.
Also Read:Vijay Deverakonda- Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించబోతున్న విజయ్ దేవరకొండ
[…] Also Read: NTR vs Pawan Kalyan – BJP: ఇటు పవన్.. అటు ఎన్టీఆర్.. బీజ… […]