Janasena BJP Alliance
Janasena BJP Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సంఖ్యాపరంగా బలంగా ఉన్న వెనుకబడిన తరగతుల ముదిరాజ్ సామాజికవర్గాన్ని అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్క ముదిరాజ్‌కు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దీంతో ముదిరాజ్‌లు ఇప్పటికే ఆ రెండు పార్టీలపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ముదిరాజ్‌ల తర్వాతి స్థానంలో ఉన్న కాపులు కూడా ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను డిసైడ్ చేయనున్నారు. ఈ సామాజికవర్గానికి కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇందులో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాత్రమే బలమైన నాయకుడిగా ఉన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీలో బలమైన నేతలు..
ఇదిలా ఉండగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన పలువురు మున్నూరు కాపు నేతలు తమ సామాజికవర్గ ఓటర్లపై మంచి ప్రభావం చూపుతున్నారు. బీజేపీలో ఎంపీలు బండి సంజయ్‌కుమార్, ధర్మపురి అరవింద్, కె. లక్ష్మణ్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జోగు రామన్న, దానం నాగేందర్, వనమా వెంకటేశ్వరరావు, బాజిరెడ్డి గోవర్ధన్, జాజుల సురేందర్, కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్సీ దండే విఠల్ ఉన్నారు.
జనసేనతో పొత్తుతో..
తాజాగా తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. సీట్ల పంపకం విషయం కూడా నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పవన్ ప్రభావం కాపు సామాజికవర్గంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆయన స్టార్ ఇమేజ్, యువత బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని బీజేపీతోపాటు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ–జనసేన పొత్తుతో బీజేపీకి కచ్చితంగా లబ్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన ప్రభావంతోనే బీజేపీ 47 కార్పొరేట్ స్థానాల్లో గెలిచిందని పేర్కొంటున్నారు.
బీజేపీ బీసీ నినాదం..
మరోవైపు బీజేపీ ఈసారి బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. అవసరమైతే ఎన్నికలకు ముందే బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనలో ఉంది. 50 స్థానాలు బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన కూడా తనకు కేటాయించే స్థానాల్లో సగం బీసీలకే ఇవ్వాలని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న మున్నూరు కాపులు బీజేపీ–జనసేనవైపు మళ్లే అవకాశం ఉంటుందని అంచనా. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో మున్నూరు కాపుల ఓట్లు బీజేపీకి పోలరైజ్ అవతాయా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.