BRS In Delhi: సాధారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానంలో వెళ్లాలంటే మామూలు రోజుల్లో అయితే ఐదు నుంచి తొమ్మిది వేలు అవుతుంది. అదే రద్దీ రోజుల్లో అయితే ఇంకో రెండు మూడు వేలు ఎక్కువ అవుతుంది.. ఇక బిజినెస్ క్లాసులో వెళ్లాలంటే ఓ పదిహేను వేలు సమర్పించుకోక తప్పదు.. కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఇప్పుడు 70 వేల దాకా వసూలు చేస్తున్నారు. వామ్మో అని డబ్బులే అని అనుకుంటున్నారా… అవును ఇప్పుడు నిజంగానే ఆ స్థాయికి పెరిగింది టికెట్ రేటు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.

బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుతో..
సాధారణంగా డిసెంబర్ నెలలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమాన చార్జీలు ఒక మోస్తరుగా ఉంటాయి.. ఎందుకంటే ఈ రోజుల్లో ఎటువంటి పండుగలు ఉండవు.. విమానయాన పరిశ్రమ వర్గాల ప్రకారం దీన్ని డ్రై స్పెల్ అంటారు. కానీ ఈ డ్రై స్పెల్ లో కూడా ఈసారి విమాన చార్జీలు ఆకాశాన్ని అంటాయి.. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల భారత రాష్ట్ర సమితి పేరుతో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఒక్కసారి గా అందరూ ఢిల్లీ బాట పడటంతో.. విమానాలకు గిరాకీ పెరిగింది. దీంతో చార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఏకంగా టికెట్ ధర 70 వేలకు చేరుకుంది..
ప్రయాణికుల బెంబేలు
ఢిల్లీలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నేతలు తరలి వెళ్లారు. వీరిలో కొందరు తిరుగు ప్రయాణానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారు.. ఇలా ఏర్పాటు చేసుకోని వారంతా బుధవారం రాత్రి, గురువారం తిరుగు ప్రయాణానికి విమాన టికెట్ల కోసం ప్రయత్నించారు..బుకింగ్ కు రద్దీ అధికంగా ఉండడంతో టికెట్ ధర అమాంతం పెరిగిపోయింది. బుధవారం రాత్రి ఫ్లైట్ టికెట్ ధర 70,000 పలికింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు నేరుగా వెళ్లే ఫ్లైట్ టికెట్లు కూడా ముందుగానే అమ్ముడుపోవడంతో వాటి బుకింగ్స్ ను విమానయాన సంస్థలు మూసివేశాయి.. దీంతో ఆలస్యమైన లింక్ విమానాలు… అంటే ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల మీదుగా హైదరాబాద్ చేరుకునే ఫ్లైట్ టికెట్లను విక్రయించాయి.

వీటి టికెట్ల ధరలు కూడా 70,000 పలికాయి.. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రెండు విమాన సర్వీసులు నడిపిన విస్తార సంస్థ చివరి టికెట్లను ఒక్కొక్కటి 70,079 గా విక్రయించింది.. ఇంత ఖర్చు చేసినప్పటికీ 15 గంటల 35 నిమిషాల పాటు మరో విమానం కోసం ఎయిర్ పోర్ట్ లో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి నేరుగా సర్వీస్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.. అవి కూడా 20వేల వరకు ఉండడం గమనార్హం.. ఒకసారి గా పెరిగిన ఈ టికెట్ రేట్ల తో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు పలువురు సాధారణ ప్రయాణికులు కూడా అవస్థ పడ్డారు.. కొంతమంది ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.. ఢిల్లీలోనే ఉండిపోయారు. తాను, తన అనుచరులకు టికెట్లు దొరకపోవడంతో హోటల్లో ఒక గది బుకింగ్ ను మరొక రోజుకు పొడిగించుకున్నానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు.