
‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ.. రాజకీయ అనుభవాన్ని ఘనంగా చాటుకునే బాబును ఇప్పుడు జాతీయంగా ఎవ్వరూ పట్టించుకోవట్లేదా? నేతలంతా ఆయన్ను కావాలనే విస్మరిస్తున్నారా? ఇదంతా బాబు స్వయం కృతమేనా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకనాడు జాతీయ స్థాయిలో చక్రాలు, బొంగరాలు తిప్పిన బాబు.. ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోని నేతగా మిగిలిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు. దేశ రాజకీయాల్లో తనదైన రాజకీయం చేశారు కూడా. కానీ.. ఇవాళ ఆయన్ను పట్టించుకునే జాతీయ నేత ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టున్నాయి. కానీ.. చంద్రబాబును మాత్రం లిస్టులోకి తీసుకోవట్లేదని సమాచారం.
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. మూడో ఫ్రంట్ పై పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ప్రాంతీయ పార్టీలకు ఆమె లేఖలు కూడా రాశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ముందు వరసలోనే ఉన్నారు. ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ వంటి నేతలు కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మూడో ఫ్రంట్ ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ ఫ్రంట్లో చంద్రబాబు జోలికూడా తేవట్లేదని తెలుస్తోంది.
దీనికి కారణం.. చంద్రబాబుకు ఒక స్టాండ్ అనేది లేదని ఆ నేతలు భావించడమేనట! జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఇద్దరితోనూ ఆయన చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు. ఆ తర్వాత దోస్తీ కట్ చేశారు. ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. పలుప్రాంతీయ పార్టీలు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఈయన మాత్రం పల్లెత్తు మాట అనట్లేదు.
ఇలాంటి కారణాలతో చంద్రబాబును దూరం పెట్టడమే మంచిది నిర్ణయానికి వచ్చారట. ఆయన్ను పూర్తిస్థాయిలో నమ్మడానికి లేదని కూడా అనుకుంటున్నారట. అవసరమైతే జగన్ ను లైన్లోకి తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. అంతేతప్ప.. బాబును మాత్రం దగ్గరికి రానివ్వొద్దనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట. దీనికి చంద్రబాబు స్వయంకృతాపరాధమే కారణమని తీర్మానిస్తున్నారు విశ్లేషకులు. మరి, ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అన్నది చూడాలి.