
‘కరోనా’ సినిమా బతుకులను చిదిమేసే దాకా శాంతించేలా లేదు. మొత్తానికి అనుకున్నట్లే జరిగింది. ఏది అయితే జరగకూడదు అని సినిమా వాళ్ళు బలంగా కోరుకున్నారో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో ఇక పై అన్ని సినిమా థియేటర్లలో సీటు, సీటుకి మధ్య ఖాళీ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం మంచి నిర్ణయమే. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం చిన్న సినిమాల నిర్మాతలకు తీవ్రంగా నష్టం చేకూర్చనుందని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. పెద్ద సినిమాలు పోటీలో లేవు కాబట్టి, ల్యాబ్ లో ఖాళీగా పడి ఉన్న చిన్న సినిమాల దుమ్ము దులపాలని ఆయా చిత్రాల మేకర్స్ నిర్ణయించుకున్నారు.
పనిలో పనిగా వరుసగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తూ.. తెగ హడావుడి చేసారు. ఇంత చేస్తే.. చివరకు మిగిలింది భయమే. అన్ని థియేటర్లలో 50 శాతం మాత్రమే టికెట్లు అమ్మాలి. సీటు విడిచి సీటు టికెట్లు ఇవ్వాలి అంటూ జగన్ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. ఇదేదో తమకు వచ్చే లాభాలను పోగొట్టే నిర్ణయం అని ఆ చిన్న నిర్మాతలు భావించడం లేదు గాని, కరెక్ట్ గా తమ సినిమాలను రిలీజ్ కి ప్రకటించుకున్న తరువాత ఇలా ప్రకటించడం బాగాలేదు అంటూ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని ప్రభుత్వం చెబుతుంది.
ఆ మాటకొస్తే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయం ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అంతలో ఏపీ గవర్నమెంట్ ముందుగా నిర్ణయం తీసుకొంది. ఎలాగూ ప్రస్తుతం అన్ని సినిమా హాళ్లు కలెక్షన్లు లేక బోసిపోతున్నాయి. ‘వకీల్ సాబ్’ విడుదలైన తర్వాత నాలుగు రోజులు బాగా కలెక్షన్లు కనిపించాయి. కానీ ఆ తర్వాత నుండి బాక్సాఫీస్ వద్ద ఖాళీ కనిపిస్తోంది. ఇక గత వీకెండ్ మరి తక్కువ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో జనం కరోనా భయంతో ఎంతగా జంకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాల కోసం థియేటర్స్ కి ఎవ్వరూ వెళ్లరని చిన్న సినిమాల మేకర్స్ గ్రహిస్తే మంచింది.