వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా జరబోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికలంటే జాతీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ గెలిస్తే చాలు.. ఢిల్లీని ఢీకొట్టడం ఈజీ అని భావిస్తాయంటే.. యూపీ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. 403 స్థానాలున్న యూపీని స్వాధీనం చేసుకునేందుకు పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రంగంలోకి దిగారు. 2012లో తిరుగులేని విజయం సాధించిన ఎస్పీ.. 2017 ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టినా.. నిరాశే ఎదురైంది. కేవలం 47 స్థానాలకు పరిమితమైంది. మరో ప్రధాన పార్టీ బహుజన్ సమాజ్ తో దోస్తీకూడా ఉపయోగపడలేదు. దీంతో.. ఈ సారి సింగిల్ గానే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు అఖిలేష్. చిన్నా చితకా పార్టీలతో మాత్రం సర్దుబాటు చేసుకునేందుకు చూస్తున్నారు.
అటు ప్రత్యర్థులు సైతం పావులు కదుపుతున్నారు. మళ్లీ యూపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యోగీపాలనలో కాస్త వ్యతిరేక పవనాలే వీస్తున్నట్టు కనిపించగా.. ఆ పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తోంది. బీఎస్పీతోపాటు పూర్వవైభవం చాటుకునేందుకు కాంగ్రెస్ కూడా తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికన్నా ముందుగానే ప్రజల్లోకి వెళ్తున్నారు అఖిలేష్.
ఇందులో భాగంగా.. అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిలే అన్నది తెలిసిందే. సైకిల్ పై ఎక్కి జనాల్లోకి బయల్దేరిన అఖిలేష్.. ఎన్నికల నాటికి పార్టీని బలమైన పోటీదారుగా నిలపాలని యోచిస్తున్నారు. ఈ యాత్ర సందర్భంగానే పార్టీ అభ్యర్థులను గుర్తించడం.. అసంతృప్తులను బుజ్జగించడం వంటి పనులు సైతం చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి, ఈ యాత్రతో అఖిలేష్ చరిత్ర తిరగరాస్తారా? లేదా? అన్నది చూడాలి.