
MIM: మజ్లీస్ అంటే… ఇన్నాళ్లు ఏడు సీట్ల పార్టీగాను, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన పార్టీగానే ఉండేది. కానీ ఇప్పుడు అదే మజ్లీస్… కెసిఆర్ తో అంట కాగిన మజ్లీస్.. 2023 లో భారత రాష్ట్ర సమితికి దమ్కీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.. ఇందుకు సంబంధించి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇందుకు కారణం లేకపోలేదు… మొన్న అసెంబ్లీలో ఏడు సీట్ల పార్టీ అని కేటీఆర్ గారికి చేయడంతో అక్బరుద్దీన్ కు కోపం తెప్పించింది.. అంతేకాదు తను ఈసారి 50 సీట్లలో పోటీ చేస్తాం, 15 మందితో సభకు వస్తానంటూ సీరియస్ వ్యాఖ్య చేశాడు. అబ్బే వాళ్ళూ వాళ్ళూ ఒకటే.. అప్పుడప్పుడూ ఇలా ఝలక్ లు ఇస్తారు. అంతే తప్ప కేసీఆర్ తో జాన్ జిగ్రీ దోస్తీని వాళ్లు ఎందుకు వదులుకుంటారు? కేసీఆర్ వాళ్లకు ఎన్నెన్నో పనులు చేసి పెట్టాడు.. కెసిఆర్ మళ్ళీ గెలిస్తేనే వాళ్లకు పండుగని… తేలికగా తీసిపారేసి వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్లకు 50 సీట్లల్లో పోటీ చేసేంత సీన్ ఎక్కడిది? వాళ్లు పాతబస్తీ దాటి బయటకు వెళ్ళింది ఎప్పుడు అనే అభిప్రాయాలూ వస్తున్నాయి. కానీ తప్పు.. మజ్లీస్ ఎప్పుడూ తన ప్రయోజనాలనే చూసుకుంటుంది.. తనకు ఏది ప్రయోజనమో లెక్కలేసుకుంటుంది..ఆఫ్ కోర్స్ ప్రతి పార్టీ కూడా అంతే. ఆ పార్టీ హైదరాబాద్ దాటి ఇప్పటిదాకా లోక్ సభ, శాసనసభ స్థానాలకు పోటీ పోవడం లేదనేది నిజమే..కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆల్రెడీ సత్తా చాటింది.. వేరే రాష్ట్రాలకు కూడా పాకుతోంది.
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హిందూ ఓటును సంఘటితం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుంటే… కావాలని భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం అవసరార్థం ప్రత్యర్థిత్వాన్ని కనబరిచాయి. ఎంఐఎం మాకు సహజమిత్రుడు అని వ్యాఖ్యానించిన నోళ్ళే అబ్బే, వాళ్లకూ మాకూ దోస్తీ లేదు అన్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఎంఐఎం కు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. అది దూరం దూరంగానే ఉంటున్నది. నిజంగానే ఎంఐఎం ఘనత రాష్ట్రవ్యాప్తంగా విడిగా పోటీ చేస్తే అది కచ్చితంగా భారత రాష్ట్ర సమితి అవకాశాలకు ఎంతో కొంత దెబ్బ. ఇన్నాళ్లు పాతబస్తీలోని ఏడు సీట్లు, ఒక ఎంపీ సీటు మినహా ప్రతిచోటా ముస్లిం ఓట్లు భారత రాష్ట్ర సమితి పడుతూ వస్తున్నాయి.. అవన్నీ ఎంఐఎం వైపు వెళ్తే కేసీఆర్ కు నష్టమే అవుతుంది.

నిజంగానే ఈసారి ఎక్కువ సీట్లలో అసెంబ్లీకి వస్తే… హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అంచనాల మధ్య తమకు సొంతంగా రాకపోయినా సరే, తమ బార్గేనింగ్ కెపాసిటీ పెరుగుతుందని గనుక ఎంఐఎం బలంగా భావించే పక్షంలో తప్పకుండా పాత బస్తి దాటి బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో సియాసత్ డైలీ ఈ ప్రస్తుత చర్చకు ముందే గత నెలలో ఎంఐఎం పార్టీకి సంబంధించి విస్తరణ మీద ఒక కథనం ప్రచురించింది..
ఎంఐఎం 50 స్థానాల్లో పోటీకి ఏడాదిగా కసరత్తు ప్రారంభించింది..ఎక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి? ఏయే సీట్లు ఎంఐఎం పోటీ చేసేందుకు మంచి చాన్స్ ఉంది? అనేది కసరత్తు..ఆ మధ్య దారుస్సలాం లో జరిగిన ఓ మీటింగ్ లో జిల్లాల ఎంఐఎం కేడర్ ప్రజా సమస్యలను ఎక్స్ ఫోజ్ చేయాలని పిలుపునిచ్చాడు. ఇప్పటికీ 17 సీట్లు గుర్తించారట. నిజామాబాద్ అర్బన్, కరీం నగర్, బోధన్, కామా రెడ్డి, నిర్మల్, ముతోల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, కోరుట్ల, భువనగిరి, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్, ఖమ్మం, జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్, సీట్లలో పోటీకి ఆల్ రెడీ బ్లూ ప్రింట్ రెడీ అయిందని ఎంఐఎం వర్గాలు అంటున్నాయి. కేవలం ముస్లిం లే కాకుండా బీసీ,ఎస్సీ,ఎస్టీల ను రంగంలోకి దింపాలని ఎంఐఎం ఆలోచన. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ లో మీర్ మజాజ్ ను నిలబెడితే 23.53 శాతం ఓటింగ్ వచ్చింది. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని అసదుద్దీన్ ప్లాన్ వేస్తున్నాడు. మరీ దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
