Former CBI JD Lakshminarayana: ఏపీలో పొత్తులు ఒక కొలిక్కి రాలేదు. ఎన్నికల తరువాత ఏర్పాటుచేసే ప్రభుత్వాలకు సంబంధించి అధికార పంపకాల గురించి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రిత్వ శాఖల కేటాయింపులపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతున్నాయి. టీడీపీ, జనసేన అలయెన్స్ గా ఏర్పడి అధికారంలోకి వస్తే పదవుల పంపకాలు ఎలా ఉంటాయని లక్ష్మీనారాయణ విశ్లేషించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి టీడీపీ,జనసేన మధ్య సానుకూల వాతావరణం ఉంది. బీజేపీ కూడా కలిసి వస్తుందన్న ప్రచారం అయితే ఉంది. దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు అధికార పంపకాలు గురించి మాట్లాడడం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది.

ముందుగా టీడీపీ, జనసేన అలయెన్స్ గా మారితే సక్సెస్ తప్పకుండా అవుతాయని జేడీ అభిప్రాయపడ్డారు. ముందుగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. అదే సమయంలో చంద్రబాబు తిరిగి తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటువంటి విభిన్న పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇదే ఫార్ములా కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే అది ఆ పార్టీలకువచ్చే మెజార్టీ స్థానాలపై ఆధార పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అయితే సీఎం, డిప్యూటీ సీఎం ఫార్ములా వర్కవుట్ కాకుంటే మాత్రం సీఎం పదవి చెరి సగం పంచుకునే అవకాశముందన్నారు. ఇప్పటికే బిహార్,తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో అమలైందని చెప్పారు. అటు ఎవరికి ఎన్ని మంత్రిత్వ శాఖలు అన్నది కూడా నిర్ణయం ముందుగానే జరిగిపోతుందన్నారు. అయితే ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలేనని తేల్చిచెప్పారు. అయితే లక్ష్మీనారాయణ ప్రస్తుతం స్వాతంత్రంగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి జనసేన తరుపున పోటీచేసిన ఆయన గణనీయమైన ఓట్లు సాధించారు. ఎన్నికల తరువాత జనసేనకు దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి జనసేనలకి రీఎంట్రి ఇస్తారని టాక్ నడుస్తోంది. ఈ సమయంలో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారాయి.