Telangana Congress: ఏ ముహూర్తాన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో తెలియదు కాని.. దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా అధికార భారత రాష్ట్ర సమితికి గట్టి సవాళ్లు విసురుతోంది. అధికార పార్టీ నుంచి భారీగా చేరికలు ఉంటుండడంతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో ఏ విధమైన ప్రణాళిక అవలంబించిందో.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆదే సూత్రాన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావాలని కృత నిశ్చయంతో ఉంది. దీనికోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతేకాదు ఈనెల 30వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఏకంగా బీసీ దిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి తోడు అదే సందర్భంలో పార్టీలో పలువురు చేరే అవకాశం కల్పిస్తోంది. అయితే అధికారం ముంగిట పార్టీ ఎక్కడ వెనుకబడి ఉందో వ్యూహ కర్త సునీల్ కనుగొలు ఇప్పటికే కీలక నేతలకు వివరించారు. అంతేకాదు ఆగస్టు 15న మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించాలని సూచించినట్టు సమాచారం.
బీసీ ఓటు బ్యాంకు పై..
కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి బలాలు,బలహీనతలపై సునీల్ ఆధ్వర్యంలో పకడ్బందీగా సర్వే నిర్వహించారు. ఈ నివేదికను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ కమిటీ చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. వచ్చే వంద రోజుల్లో ప్రచార కార్యక్రమాలు ఉదృతం చేయాలని, అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు ఏం చేయాలి అనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. దళిత, వెనుకబడిన, మైనార్టీలు, మహిళల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై డిక్లరేషన్ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇవి పూర్తి చేసిన తర్వాతనే ప్రచారంలోకి దిగాలనే అంగీకారానికి వచ్చింది. డిక్లరేషన్ల రూపకల్పనకు గానూ నిపుణులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రియాంక, ఖర్గే సభలు
వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రతి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. రంగా తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు, అసెంబ్లీ పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరీ లోకి దింపాలని భావిస్తోంది. ఆగస్టు 15న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గర్జన సభ నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సభలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఏం చేస్తామనే దానిని వివరిస్తూ కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించనుంది. ఈనెల 30న కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సభా వేదిక ద్వారా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
కొల్లాపూర్ సభ ద్వారానే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. బీసీ గర్జన సభను ఏర్పాటు చేసి, దానికి రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామాయణం కూడా ఆహ్వానించాలని విహెచ్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే పార్టీ వ్యూహ కర్త సునీల్ కనగోలు రాష్ట్రంలో ఎంపీ స్థానాల వారీగా పార్టీ బలాబలాలను చదివి వినిపించారు. అయితే ఐదు ఎంపి స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ప్రకటించారు. ఇకచోట్ల పార్టీ బలంగా మెరుగుపడిందని, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ ఐదు స్థానాల్లో కూడా పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. నేతల మధ్య స్వల్ప అంతరాలు ఉన్నాయని, సంప్రదింపుల ద్వారా వాటిని తొలగించుకోవాలని సూచించారు. నేతల మధ్య ఐక్యత ఉంటే పార్టీ గెలవడం పెద్ద విషయం కాదని ఆయన వివరించారు. వీటి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.