Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువు ఉంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం ఈ 18 రోజులు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. అధికార బీజేపీ మరోమారు గెలవాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల జోషల్‌తో కాంగ్రెస్ గెలుపు తమదే అంటోంది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఈసారి ఆప్ కూడా అధికారంలోకి వస్తామంటోంది. ఈ క్రమంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం అంత ఈజీ కాందంటున్నారు విశ్లేషకులు.. ఈ ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇండియన్ నేషనల్ లోక్‌దల్, బహుజన్ సమాజ్‌పార్టీ, హర్యానా లోఖిత్ పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మాత్రం ఒంటరిగా బరిలో దిగాయి.
మూడు కుటుంబాలదే ఆధిపత్యం..
హర్యానా రాష్ట్రం 1966లో ఏర్పడింది. నాటి నుంచి రాష్ట్రంలో మూడు కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేవీలాల్, భజన్‌లాల్, బన్సీలాల్ కుటుంబాల చుట్టూ రాజకీయాలు తిరుగుతుంటాయి. ఈ ముగ్గురూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. దేవీలాల్ 1989 నుంచి 1991 వరకు ఉప ప్రధానిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నేతల వారసులు హర్యానాలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నారు. దేవీలాల్ మనుమడు ఆదదిత్య దేవీలాల్ ఇండియన్ నేషలన్ లోక్‌దల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరో మనుమడు దిగ్విజయ్‌సింగ్ చౌతాలా జననాయక్ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దేవీలాల్ కొడుకు రంజిత్ సింగ్ ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఇక భజన్‌లాల్ మనుమడు భవ్య భిష్ణోయ్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. బన్సీలాల్ వారసులు అనిరు«ద్ చౌదరి కాంగ్రెస్ టికెట్‌పై పోటీలో ఉన్నారు.
2014 నుంచి బీజేపీదే అధికారం..
ఇదిలా ఉంటే.. హర్యానాలో 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారం నిలబెట్టుకుంటామని నేతలు చెబుతున్నారు. ఈమేరకు ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అగ్రనాయకులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పది స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీ ఐదు, కాంగ్రెస్ ఐదు గెలిచాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఆన్న ఆందోళన కమలనాథుల్లో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జోష్ ఇచ్చాయి.
రైతులే కీలకం..
హర్యాన ఎన్నికల్లో రైతులే అధికార పార్టీని నిర్ణయిస్తారు. అందుకే అన్ని పార్టీలు రైతు ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నాయి. అయితే రైతు వ్యతిరేక చట్టాలు, అగ్నిపథ్, నిరుద్యోగ సమస్య ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ గెలుపుపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం.. గెలుపుపై ధీమాతో ఉంది. పదేళ్లు తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని అంచా వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రం హర్యానా అని ప్రచారం చేస్తోంది. రైతు ఉద్యమాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. మరి హర్యానా ఓటర్లు బీజేపీకి మళ్లీ పట్టం కడతారా.. హస్తం పార్టీని అక్కున చేర్చుకుంటారా అనేది అక్టోబర్ 8న తేలిపోతుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Against bjp in haryana elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com