
అప్ఘనిస్తాన్ ను కైవసం చేసుకున్న తాలిబన్లు అరాచకం మొదలుపెట్టారు. వారు ప్రజల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో తెలిపే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. కాబూల్ విమానాశ్రయంలో ఎత్తైన గోడను ఎలాగో ఎక్కి.. అవతలివైపు దిగడానికి ప్రయత్నంచిన ఓ అప్ఘన్ దేశీయుడిపై తాలిబన్ ఫైటర్ కాల్పులు జరిపిన వీడియో ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఆ బుల్లెట్ అతడి కాలికి తగలడంతో భయంతో మళ్లీ అటువైపే దూకేసిన దైన్యం కనిపించింది.
గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం హెచ్చరించేవారు కొట్టేవారు. కానీ తాలిబన్లు మాత్రం ప్రజల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. తాలిబన్ ఫైటర్ గోడ ఎక్కి వస్తున్న వ్యక్తి విషయంలో అమానుషంగా ప్రవర్తించి కాల్పులు జరపడం విస్తుగొలుపుతోంది.
అమాయక పౌరుల పట్ల తాము హింసకు దిగబోమని తాలిబన్లు ఇచ్చిన హామీ ఒట్టి బూటకమని తాజా వీడియోతో తేలిపోయింది. కాబూల్ నగరంలో ప్రవేశించిన రెండు రోజులకే వీళ్లు ఇలా ప్రవర్తిస్తే ఇక రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.
ప్రస్తుతం అప్ఘనిస్తాన్ వీధుల్లో తాలిబన్ల అరాచకం నడుస్తోంది. ఏ ఒక్క తాలిబన్ కూడా చేతుల్లో ఆయుధం లేకుండా కనపడడం లేదు. ఈ క్రమంలోనే అప్ఘన్ లో ఉండలేక ప్రజలు పారిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే అప్ఘన్ ప్రజలు తాలిబన్లకు భయపడి ఎయిర్ పోర్టుకు పోటెత్తుతున్నారు.విమానాలు నిండినా కూడా వేలాడుతూ గాల్లోంచి కిందపడిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. ప్రాణాల కోసం వీళ్లు చేస్తున్న సాహసాలు చూసి ప్రపంచమే నివ్వెరపోతున్న పరిస్థితి నెలకొంది.
https://twitter.com/AsvakaNews/status/1427496891067994114?s=20