Mahadev Betting App Case: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు చాలామంది రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. అసలుకు రెట్టింపు లాభం అంటూ ప్రచారం చేస్తూ దర్జాగా దండుకుంటున్నారు. ఈ అక్రమార్కులకు ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం ఉండటంతో వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. అయితే రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా.. పాపం పండినప్పుడు చేసిన తప్పు బయటపడుతుంది. అలాంటి తప్పుకు పాల్పడి.. అమాయకుల నుంచి 15 వేల కోట్లను దండుకుంది మహాదేవ్ బెట్టింగ్ యాప్.. అనే సంస్థ. సంవత్సరం క్రితమే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి తన పదవి కూడా కోల్పోయారు. ఎన్నికల ముందు అనూహ్యంగా ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు తవ్వడం మొదలుపెట్టాయి. ఒక బాలీవుడ్ నటుడిని కూడా అరెస్టు చేశాయి.
సోషల్ మీడియా వేదికగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ ను కొందరు అక్రమార్కులు ఏర్పాటు చేశారు. అసలుకు రెట్టింపు లాభం వస్తుందని సెలబ్రిటీలతో ప్రచారం చేయించారు. మహదేవ్ కంపెనీ పేరు మీద 67 బెట్టింగ్ వెబ్ సైట్లు, యాప్స్ సృష్టించారు. అమాయకులను ఆకర్షించేందుకు బాలీవుడ్ ప్రముఖులతో ప్రచారం చేయించారు. క్రికెట్, ఫుట్ బాల్, తీన్ పత్తి వంటి వాటిల్లో గ్యాంబ్లింగ్/ బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక ఆటలు ఆడించారు. అప్పట్లో సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2023 నవంబర్లో మాతోంగ అనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రవి ఉప్పల్ ను గుర్తించి, గత ఏడాది దుబాయిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినందుకు గాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రవి ఉప్పల్ ఈ యాప్ నిర్వహణ కోసం నకిలీ పత్రాలు సృష్టించి, 2000 బోగస్ సిమ్ లు, 1,700 బ్యాంకు ఖాతాలు తెరిచినట్టు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గంలో ఇతర దేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ యాప్ ప్రమోటర్లలో సౌరభ్ చంద్రకర్ కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది ఇతడి వివాహం దుబాయిలో జరిగింది. ఇందుకోసం ఏకంగా 200 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు. ఈ బెట్టింగ్ నిర్వాహకులు అప్పటి ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కు ముడుపులు ఇచ్చినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఆయన ప్రభుత్వం ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ఈ వ్యవహారం కారణమైందనే విమర్శలున్నాయి.
ఇక ఈ యాప్ కోసం బాలీవుడ్ నటుడు, ఫిట్ నెస్ ఇన్ ఫ్లూ యె న్సర్ సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సైబర్ విభాగాన్ని చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతడిని ఛత్తీస్ గడ్ లో అరెస్టు చేసింది. పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని సాహిల్ ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ముంబై హైకోర్టు తిరస్కరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సాహిల్ కు గత ఏడాది డిసెంబర్లో సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ అతడు విచారణకు రాలేదు. అయితే తాను యాప్ ప్రమోషన్ లో మాత్రమే పాల్గొన్నారని, తనకు ఆ యాప్ నిర్వాహకులకు ఎటువంటి సంబంధం లేదని సాహిల్ అప్పట్లో ప్రకటించాడు. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం మాత్రం దీనిని తోసిపుచ్చుతోంది. యాప్ నిర్వాహకులకు, సాహిల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందులో వాటా కూడా ఉందని వాదిస్తోంది. ఎన్నికలవేళ సాహిల్ ను అరెస్టు చేయడం బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చకు దారి తీస్తోంది. స్టైల్, ఎక్స్ క్యూజ్ మీ అనే చిత్రాల ద్వారా సాహిల్ ఖాన్ గుర్తింపు పొందాడు.