https://oktelugu.com/

అవినీతి ఏసీపీ.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

రెండు రాష్ట్రాలు.. ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు.. నాలుగైదు చోట్ల ప్లాట్లు.. కమర్షియల్‌ బిల్డింగ్‌.. రెండు ఇండ్లు. రియల్‌ ఎస్టేట్‌లో ఎట్టుబడులు.. బ్యాంకులో లాకర్లు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.70 కోట్ల అక్రమాస్తులు. ఇదీ మల్కాజిగిరి ఏసీపీగా పనిచేస్తున్న ఎల్మకూరి నర్సింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా. Also Read: ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాతో పెట్టుకుంటే అంతేమరీ! ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ వై.నర్సింహారెడ్డి అవినీతి నిరోధక శాఖ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 10:51 am
    Follow us on


    రెండు రాష్ట్రాలు.. ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు.. నాలుగైదు చోట్ల ప్లాట్లు.. కమర్షియల్‌ బిల్డింగ్‌.. రెండు ఇండ్లు. రియల్‌ ఎస్టేట్‌లో ఎట్టుబడులు.. బ్యాంకులో లాకర్లు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.70 కోట్ల అక్రమాస్తులు. ఇదీ మల్కాజిగిరి ఏసీపీగా పనిచేస్తున్న ఎల్మకూరి నర్సింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా.

    Also Read: ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాతో పెట్టుకుంటే అంతేమరీ!

    ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ వై.నర్సింహారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులు అతని నివాసంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మహేంద్రహిల్స్‌లోని నర్సింహారెడ్డి నివాసంతోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, వరంగల్‌, జనగాం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు చేశారు. తెలంగాణ,  ఏపీలోని 25 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు  చేసి రూ.70 కోట్ల ఆస్తులను గుర్తించారు. మహేంద్రహిల్స్‌ త్రిమూర్తి కాలనీలోని నర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీలు జరిపింది.

    ఇరు రాష్ట్రాల్లోనూ ఏసీబీ అధికారులు 18 గంటలపాటు సోదాలు నిర్వహించారు. 3 ఇళ్లు, 5 ఓపెన్‌ ప్లాట్లు, కమర్షియల్‌ స్తలాలతోపాటు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లు గుర్తించారు. మరో బృందం ఉప్పల్‌లోని మల్కాజిగిరి ఏసీపీ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు జరిపింది. దీంతోపాటు నర్సింహారెడ్డికి బినామీగా భావిస్తున్న ఉప్పల్‌లో నివసించే ఓ ఏఎస్సై ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు మేడిపల్లి, ఉప్పల్‌లోని నర్సింహారెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశా రు. జనగామ జిల్లాలోనూ 3 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లింగాలఘణపురం మండలం వడ్డిచర్లలో నర్సింహారెడ్డి అత్తవారింట్లో, బచ్చన్నపేట మండలంలోని కట్కూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బండి చంద్రారెడ్డి నివాసంలో, రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లిలోని ఏసీపీ ప్రైవేటు డ్రైవర్‌ పోరెడ్డి తిరుపతిరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు.

    నర్సింహారెడ్డి రియల్‌ ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు ఆధారాలతో గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం రూ.70 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. అనంతపూర్‌‌లో 55 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ సైబర్‌‌ టవర్స్‌ ముందు 1,960 గజాల 4 ప్లాట్లు, మాదాపూర్‌‌లో ఇండ్ల ప్లాట్లు, హఫీజ్‌పేట్‌లో జీ+3 కమర్షియల్‌ బిల్డింగ్‌, రెండు ఇండ్లు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు, రెండు బ్యాంక్‌ లాకర్లు, 15 లక్షల క్యాష్‌ ఉన్నట్లు గుర్తించారు.

    నర్సింహారెడ్డి ఘట్‌కేసర్‌లోని యామన్‌పేట్‌లో 30 ఎకరాల భూమిని స్థానిక రాజకీయ నాయకులతో కలిసి కొనుగోలు చేయగా, ఇది వివాదానికి దారి తీసినట్లు సమాచారం. దీంతోపాటు ఇటీవల కొండాపూర్‌లోనూ అసైన్డ్‌ భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెం దిన ఎంపీపీ మధుకర్‌ ద్వారా కొండాపూర్‌లోని భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. మధుకర్‌ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా.. మధుకర్‌ జీహెచ్‌ఎంసీలోని అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడికి అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: వ్యవసాయేతర ఆస్తుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?

    నర్సింహారెడ్డి ఎస్సైగా ఉన్నప్పటి నుంచి ఏసీపీ అయ్యేదాక ఆయనపై ఎప్పుడూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అసైన్డ్‌ ల్యాండ్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో ఆయన గుట్టురట్టయ్యింది. నర్సింహారెడ్డి గతంలో మియాపూర్‌, ఉప్పల్‌, బేగంపేట్‌ ఇన్‌స్పెక్టర్‌గా, చిక్కడపల్లి డివిజన్‌లో ఏసీపీగా పనిచేశారు. అక్కడి నుంచి మల్కాజిగిరికి బదిలీ అయ్యారు.