Free Gas scheme for Women :ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. ఒక్కో హామీకి ప్రాధాన్యత ఇస్తూ.. కీలక ప్రకటన చేస్తున్నారు చంద్రబాబు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ ను.. నాలుగు వేల రూపాయలు పెంచారు. పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేశారు. పాత బకాయిలతో పాటు జూలైలో మొత్తం 7000 అందించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలు యధావిధిగా నాలుగువేల పింఛన్ ను అందించి శభాష్ అనిపించుకున్నారు. ప్రతినెల 1న ఇంటింటా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను తెరిచారు. 15 రూపాయలకే మూడు పూటలా కడుపు నింపుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలపై కూడా దృష్టి పెట్టారు చంద్రబాబు. ఈ పరిస్థితుల్లో అమలు చేసి తీరుతానని చెబుతున్నారు.
* మహిళలపై ఫోకస్
ఈ ఎన్నికల్లో మహిళలను చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారు. వారికోసం కీలకమైన నాలుగు పథకాలను ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలలో వీటికి చోటిచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఏడాదికి మూడు వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం కిందట పిల్లల చదువుకు సాయం చేయడం.. ఈ నాలుగు పథకాలఫై చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై కసరత్తు ప్రారంభమైంది. కర్ణాటక తో పాటు తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని అధికారులు పరిశీలించారు. అధ్యయనం చేశారు.
* పథకంపై ఫై కీలక ప్రకటన
అయితే అంతకంటే ముందే ఒక పథకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు క్యాబినెట్లోనూ చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం కింద తొలి సిలిండర్ను దీపావళి రోజు మహిళల ఇంటికి అందేలా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకంలో గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తామని చెప్పుకొచ్చారు. తదుపరి సిలిండర్ సంక్రాంతి రోజున, మూడో సిలిండర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా మరో రోజున అందించే ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు.
* మహిళల్లో ఆనందం
చంద్రబాబు తాజా ప్రకటనతో మహిళల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 830గా ఉంది. ఏడాదికి మూడు సిలిండర్లు అంటే ఒక్కో కుటుంబానికి రూ. 2500 చేయూత అందించినట్లు అవుతుంది. అయితే ఎట్టకేలకు సంక్షేమ పథకాలు పట్టాలెక్కడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మిగతా పథకాలు సైతం అమలు చేస్తారని నమ్మకం కలుగుతుంది.