KCR ABN RK : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వ్యవహారంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అని చాలా మంది భావిస్తున్నారు. కాదు కాదు ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయానికి కేసీఆర్ భయపడుతున్నారని కూడా మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే కేసీఆర్ విషయంలో నెగిటివ్ గా ఆలోచించే వారిలో ముందుండే ఏబీఎన్ ఆర్కే మాత్రం కచ్చితంగా తెలంగాణ సీఎం భయపడుతున్నారని తేల్చేశారు. వారం వారం తాను రాసే వీకెండ్ కామెంట్స్ కొత్తపలుకులో ఈ వారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికే ప్రాధాన్యమిచ్చారు. అమ్మకం.. నమ్మకం పేరిట కాలమ్ రాసి విశ్లేషించారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. తాను పోరాడుతున్న బీజేపీపై రివేంజ్ తీర్చుకోవడానికి, మునుగోడు ఉప ఎన్నికల్లో బదనాం చేసేందుకు అవకాశం వచ్చినా ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నారు అన్న అనుమానాలు తెలంగాణ సమాజంలో సహజంగా ఏర్పడ్డాయి.

అయితే సంక్షోభాలను అధిగమించడం, సవాళ్లను స్వీకరించడం, ప్రత్యర్థుల బలం బలహీనతలతో ఆడుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాత్రం కేసీఆర్ సైలెంట్ అయ్యారు. అటు పార్టీ శ్రేణులను సైలెంట్ చేశారు. దీని వెనుక వ్యూహం ఉందని విశ్లేషణలు వెలువడ్డాయి. వ్యూహం లేదు.. తొక్కా లేదు.. దానికి భయమే కారణమని ఆర్కే చెబుతున్నారు. బయటకు వచ్చిన టేపులన్నీ ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా మాత్రమే వచ్చాయని..ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటే మాత్రం కేసీఆర్ సర్కారుతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు బాధ్యులుగా మిగిలే అవకాశముందని ఆర్కే అభిప్రాయపడుతున్నారు. అవి ట్రాప్ చేసిన ఆడియోలు కాదని.. ముందుగా మాట్లాడుకున్న ఆడియోలుగా చెబుతున్నారు. ఫామ్ హౌస్ లో కూర్చున్న ఆడియోలు అయినప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం అని ఉండదు కదా అని అర్కే అనుమానిస్తున్నారు. అందుకే ట్యాంపరింగ్ చేసి ఫోన్ సందేశాలు మాత్రమేనని.. ట్రాప్ చేసేందుకు ఎంతమాత్రం వీలులేదని వాదిస్తున్నారు.
గతంలో కూడా చంద్రబాబు విషయంలో ట్యాంపరింగ్ చేసినవేనని చెప్పారు. అయితే మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకొచ్చింది గొడవ అంటూ ఏపీకి వెళ్లిపోయారని.. కానీ మోదీ, అమిత్ షాల విషయంలో మాత్రం అది కుదిరే పని కాదని ఆర్కే తేల్చేశారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని.. చేతిలో నిఘా వ్యవస్థలన్నీ ఉన్నాయన్న విషయం కేసీఆర్ కు తెలుసును కాబట్టే తోక ముడిచారని చెప్పారు. మోదీ ద్వయం భయంతోనే వ్యూహాత్మకంగా మౌనం పాటించారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ కు ఇంటా బయటా అంతగా సానుకూలత లేదన్నారు. పైగా ప్రజలు కూడా లైట్ తీసుకున్నారని.. అంతవరకూ వస్తే కేసీఆర్ కొనుగోలు చేయలేదా? అని చర్చించుకుంటున్నారని కూడా ఆర్కే చెబుతున్నారు. మరో విషయమేమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దానికి రాజీ ఫార్ములాగా ఫామ్ హౌస్ ఘటనను వినియోగించుకుంటారని కూడా ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడూ కేసీఆర్ విషయంలో నెగిటివ్ గా ఉండే ఆర్కే ఇప్పుడు అటువంటి విశ్లేషణే చేశారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరించే సమయంలో బీజేపీ నుంచి కేసులు, ప్రతిఘటనలు ఎదురైతే కేసీఆర్ కు అడ్వాంటేజ్ అవుతుందే తప్ప.. పోయేదీమీ ఉండదు. మరీ ఈ చిన్న లాజిక్ ను మాత్రం ఆర్కే గుర్తించలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.