ABN RK : ఆర్కే కొత్త పలుకు: నైతికత కోల్పోయి మోదీ, షా ముందు సాగిల పడతారా?

వీటిని క్యాష్ చేసుకొని మోదీ, షా ఒక ఆట ఆడుకుంటున్నారని ఆర్కే కుండబద్దలు కొట్టారు. మొత్తానికి ఇందులో చంద్రబాబు ప్రస్తావన లేకపోవడంతో చెడుగుడు ఆడుకున్నారు  చాలా రోజుల తర్వాత సమకాలీన రాజకీయాల మీద ఆర్కే తనదైన శైలిలో విశ్లేషణ చేశారు!

Written By: Bhaskar, Updated On : June 11, 2023 8:15 am
Follow us on

ABN RK : చంద్రబాబు అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారు? కెసిఆర్ సడన్ గా కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నారు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి ఎందుకు అప్రూవర్ గా మారారు? ఈ సంక్లిష్ట ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. వారం వారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమయ్యే కొత్త పలుకులో.. పై విషయాలన్నింటికీ తనదైన శైలిలో రాసుకొచ్చారు.. ఆర్కే జర్నలిజం లో బ్యూటీ ఏంటంటే…అది తప్పైనా, ఒప్పైనా దాచుకోడు. రాసేస్తూనే ఉంటాడు.. అందులో ఎటువంటి షుగర్ కోటింగ్ ఉండదు. ఆయన రాసే వ్యాసంలో చంద్రబాబు ప్రస్తావన లేకుంటే ఇక చెడుగుడు ఆడుతాడు. అతడిలో ఉన్న ఒరిజినల్ జర్నలిస్టుని బయటికి తీస్తాడు.
ఏమైంది ఆ పోరాట స్ఫూర్తి?
1982లో తెలుగు నాట ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉండేవారు. నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియంత విధానాలకు పాల్పడుతూ ఉండేది. అప్పుడు దేశంలోని ప్రతిపక్ష పార్టీలను మొత్తం ఎన్టీ రామారావు ఏకం చేశారు. ఫలితంగా నియంతలాగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేలకు దిగివచ్చింది. దేశంలో ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఆ బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. వీరిద్దరి తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పగలిగే దక్షిణాది నుంచి ప్రాంతీయ పార్టీల నాయకులు లేరని ఆర్కే స్పష్టం చేశారు. ఇందుకు కారణాలు కూడా ఆయన వెల్లడించారు.
నైతికత కోల్పోయారు
చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర రావు.. వీరంతా తమ నైతికత కోల్పోవడం వల్లే మోదీ, షా ద్వయం ముందు సాగిల పడుతున్నారని ఆర్కే ఆరోపించారు. అవినీతి, బంధుప్రీతి వల్ల కేంద్రానికి దొరికిపోయారని, అందువల్లే కేంద్రం వీరిని ఒక ఆట ఆడుకుంటుందని ఆర్కే విమర్శించారు. “2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కి వ్యతిరేకంగా కూటమిని కట్టారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను ఏకం చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో చంద్రబాబుకు సినిమా అర్థమైంది. ఇంకా ఇలాగే తన వ్యవహరిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి, తన కేడర్ ను కాపాడుకునేందుకు వెనుకంజ వేశారు. ఇదే సమయంలో నాడు దూషించిన బిజెపికి స్నేహ హస్తం అందించేందుకు పావులు కదుపుతున్నారు. ఆర్ ఎస్ ఎస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అమిత్ షా తనను పిలిపించేలా ఎత్తులు వేశారు.” అంటూ ఆర్కే రాసుకొచ్చారు.
కవిత కోసం కేసీఆర్, అవినాష్ కోసం జగన్
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన కవితను కాపాడేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. అయితే అంతకుముందు బిజెపి మీద కారాలు మిరియాలు రువ్విన ఆయన.. ఎప్పుడైతే శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ గా మారారో అప్పుడే కెసిఆర్ కు సినిమా అర్థమైంది. తన కూతుర్ని కాపాడుకునేందుకు ఆయన బిజెపి పెద్దలతో సంధి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా తన యుద్ధాన్ని కాంగ్రెస్ వైపు మళ్ళించారు. దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్రంతో యుద్ధాన్ని కొనసాగించిన ఆయన సడన్  గా యూటర్న్ తీసుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి తోడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని భీషణ ప్రతిజ్ఞలు చేశారు. తన తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. నరేంద్ర మోదీని ఎదిరించే ఏకైక నాయకుడిని నేనే అంటూ ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం తెలంగాణకే పరిమితమై బేల చూపులు చూస్తున్నారు.. ఉద్యమ పార్టీలు ఇలా నైతికత కోల్పోయి సాగుల పడటం కొత్త కాదు. గతంలో బీహార్ నుంచి జార్ఖండ్ వేరుపడేందుకు కారణమైన జార్ఖండ్ ముక్తి మోర్చ.. తదనదర కాలంలో ఇలా అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొందో మనం చూసాం. ఇప్పుడు కేసీఆర్ అందుకు అతీతం కాదు. బిడ్డ కోసం ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
ఇక జగన్ కూడా భారతీయ జనతా పార్టీతో ఎన్నడూ వైరం కోలుకోలేదు. అవకాశం ఉంటే ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని, హోం మంత్రిని కలిసి వస్తున్నారు. తనకు సంబంధించిన కేసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులను దూరంగా ఉండేలా చూసుకుంటున్నారు. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కూడా జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి మద్యం కుంభకోణంలో శరత్ చంద్ర రెడ్డిని అప్రూవర్ గా మార్చారు. దీనివల్లే కేసీఆర్ బిజెపి పెద్దల పాదాక్రాంతం అయిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాంతీయ పార్టీ నాయకుల మధ్య ఎన్నో అనైకతలు ఉన్నాయి. వీటిని క్యాష్ చేసుకొని మోదీ, షా ఒక ఆట ఆడుకుంటున్నారని ఆర్కే కుండబద్దలు కొట్టారు. మొత్తానికి ఇందులో చంద్రబాబు ప్రస్తావన లేకపోవడంతో చెడుగుడు ఆడుకున్నారు  చాలా రోజుల తర్వాత సమకాలీన రాజకీయాల మీద ఆర్కే తనదైన శైలిలో విశ్లేషణ చేశారు!